ఆప్ఘాన్‌లో మొద‌లైన తాలిబ‌న్ల క్రూర‌త్వం..

Share On

తాలిబ‌న్ల క్రూర‌త్వ పాల‌న మ‌ళ్లీ మొద‌లైంది.. ఆప్ఘాన్‌లో మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు అప్పుడే రాక్ష‌స పాల‌న‌ను మొద‌లెట్టారు. హెరాట్ నగరం ప్రధాన కూడలిలో శనివారం ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. మరో మూడు మృతదేహాలను ఇతర కూడళ్లలో వేలాడ దీశారు. తాలిబన్‌ ఫైటర్లు నాలుగు మృతదేహాలను హెరాట్‌ నగర ప్రధాన కూడలికి తీసుకువచ్చారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఒక మృతదేహాన్ని నగర ప్రధాన కూడలిలో క్రేన్‌కు వేలాడ దీయగా, మిగతా కూడళ్లలో బహిరంగంగా వేలాడ దీసేందుకు మూడు మృతదేహాలను తాలిబన్లు తరలించారని ప్రత్యక్షంగా చూసిన ఫార్మసీ యజమాని వజీర్ అహ్మద్ సిద్దిఖీ తెలిపినట్లు పేర్కొంది.

కిడ్నాప్‌కు యత్నించిన నలుగురిని పోలీసులు పట్టుకుని చంపారని, ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసిన అనంతరం తాలిబన్‌ అధికారి ప్రకటించినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. మరోవైపు తమ మునుపటి పాలనలో మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్‌ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి ఇటీవల తెలిపాడు. గతంలో తాలిబన్‌ విధించిన దారుణ శిక్షల అమలుకు అతడు బాధ్యత వహించాడు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *