ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల్లో తాము జోక్యం చేసుకోలేం..

Share On

ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని రాష్ట్ర త‌ల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం పరీక్ష‌ల విష‌యంలో తాము ఇప్పుడు జోక్యం చేసుకోలేమ‌ని తెలంగాణ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి పంపుతున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి గుర్తుచేశారు. ఈ నిర్ణయం తర్వాత విద్యార్థులంతా రెండో సంవత్సరం పాఠాలు చదువుకుంటున్నారని, ఇలాంటి సమయంలో మళ్లీ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే వారు గందరగోళంలో పడిపోతారని తల్లిదండ్రుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడు కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఇంటర్‌ బోర్డు తరఫు న్యాయవాది వివరించారు.

విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసినప్పుడే పరిస్థితులను బట్టి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలూ విన్న హైకోర్టు చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ వల్ల విద్యార్థులు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే అయోమయంలో పడతారని వ్యాఖ్యానించింది. కావున పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ చేపట్టాల్సిన పిటిషన్ల జాబితాలో ఈ పిటిషన్‌ లేదు. దీంతో దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాగా, సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలా చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. పిటిషన్‌ వాపసు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *