వ‌ర‌ద‌లో చిక్కుకున్న వాహ‌నం.. ఊపిరాడ‌క న‌వ వ‌ధువు మ‌ర‌ణం..

Share On

విధి రాత ఎవ‌రిది ఏలా ఉంటుందో అర్థ‌మే కాదు.. ఎవ‌రిని మృత్యువు ఎప్పుడు, ఎక్క‌డ ఏలా కాటేస్తుందో కూడా తెలియ‌దు.. ఎన్నో ఆశ‌ల‌తో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టిన ఒక జంట క‌న్న క‌ల‌లు క‌న్నీళ్లుగా మారిపోయాయి. పెళ్లి జ‌ర‌గ‌గానే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన వారిని వ‌ర‌ద రూపంలో దూరం చేసింది. కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువును తనతో తీసుకెళ్లింది. పెళ్లికి కట్టిన తోరణాలు వాడకముందే వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వరద నీటిలో వాహనం చిక్కుకుపోవడంతో ఊపిరాడక నవ వధువు ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల కిందట వివాహం అయిన కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ఒక‌ జంట బంధువులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. శుక్రవారం రాత్రి తిరుపతి నగరంలో భారీ వర్షం కురవటంతో వరద ముంచెత్తింది. స్థానిక వెస్ట్ చర్చి సమీపంలోని రైల్వే అండర్ పాస్‌ బ్రిడ్జి వద్ద వరదలో నవ జంట ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనం చిక్కుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాహనంలోని ఆరుగురిని కాపాడారు. వాహనం నుంచి బయటికి రాలేక నవ వధువు చనిపోయింది. ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారిని రుయా ఆస్పత్రికి తరలించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *