ఆ మ‌హిళ‌.. ఉద‌యం స‌ర్పంచ్‌గా, మ‌ధ్యాహ్నం న‌ర్సుగా విధులు

Share On

ఒక ప‌క్క స‌ర్పంచ్‌గా గ్రామ స‌ర్పంచ్‌గా విధులు నిర్వ‌హిస్తూ, ప్ర‌జ‌ల అభివృద్ది కోసం పాటుబ‌డుతూనే మ‌రో ప‌క్క ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో ఉద్యోగం చేస్తున్న ఆ మ‌హిళ స‌ర్పంచ్ ఎంద‌రికో స్పూర్తిదాయకం. నిజామాబాద్ జిల్లా బోక‌న్‌ప‌ల్లి స‌ర్పంచ్ ప‌ద్మ త‌న ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోస‌మే ఉద్యోగం చేస్తున్నాన‌ని చెపుతోంది.

స‌ర్పంచ్ ప‌ద్మ మాట్లాడుతూ తన భ‌ర్త ఆరోగ్య ప‌రిస్థితి బాగా లేదని, ఆర్థిక కష్టాలు ఉన్నందునే కుటుంబ‌ పోష‌ణ కోసం న‌ర్సుగా ఒక‌ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. గ్రామంలో స‌ర్పంచ్‌గా ఇప్ప‌టికే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ప్ర‌తి రోజు ఉద‌యం గ్రామంలోని ప‌నులు, గ్రామ‌స్తుల అవ‌స‌రాలు చూసుకున్న త‌ర్వాత న‌ర్సు డ్యూటీకి వెళుతున్నాన‌ని అంటున్నారు. పద్మ సర్పంచ్‌గా పదవి చేపట్టాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డులను రూ.12 లక్షలతో నిర్మించారు. ఐతే ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో.. మిగిలిన డబ్బును అప్పు చేసి మరీ తీసుకొచ్చి అభివృద్ధి పనులకు పద్మ ఖర్చు చేశారు. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో అప్పులు తీరే దారి లేక.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏఎన్ఎంగా పద్మ డ్యూటీ చేస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. సర్పంచ్ తన సొంత డబ్బులతో చేపట్టిన పనులకు బిల్లులు విడుదల చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్పంచ్‌గా, ఏఎన్ఎంగా రెండింటికి పద్మ న్యాయం చేస్తున్నారని గ్రామస్తులు సర్పంచ్‌గా పద్మ సేవలను కొనియాడుతున్నారు.

ఇదిలా ఉండగా.. పంచాయతీ అధికారి వాదన ఇందుకు భిన్నంగా ఉంది. బోక‌న్‌ప‌ల్లి స‌ర్పంచ్ ప‌ద్మ త‌న కుటుంబ అవ‌స‌రాల కోస‌మే న‌ర్సుగా పనిచేస్తోందని, అభివృద్ది ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు అన్నీ విడుద‌ల అయ్యాయని పంచాయితీ అధికారి పి.జ‌య‌సుధ చెప్పారు. ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవ‌ని అన్నారు. అయితే కొత్త‌గా చేసిన అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ల‌క్షా 50 వేల రూపాయ‌ల బిల్లు మాత్ర‌మే పెండింగ్‌లో ఉంద‌ని ఆమె తెలిపారు. గ్రామ సర్పంచ్‌లకు నిధులు సకాలంలో విడుదల కాకపోవ‌డంతో స‌ర్పంచ్‌లు పలు గ్రామాల్లో అప్పుల‌ పాలవుతున్నారు. గ్రామంలో అభివృద్ధి ప‌నులకు ద‌శ‌ల వారిగా నిధులు విడుద‌ల చేయాల‌ని స‌ర్పంచ్‌లు కోరుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *