
చేతిలో స్మార్ట్‌ఫోన్ వచ్చినప్పటి నుంచి మనిషి దానికి బానిసగా మారిపోయారు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఫోన్ లేకుంటే బతకలేని పరిస్థితి ఏర్పడింది.. చదువుకునే యువత మాత్రం ఎక్కువగా పబ్జీకి గేమ్‌కు బానిసైపోతున్నారు. ఆ గేమ్ మాయలో పడి ప్రపంచాన్నే మరిచిపోతూ, కొంతమంది ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. తాజాగా పబ్జీ గేమ్ రెండు నిండు ప్రాణాలను బలి తీసకుంది. రాజస్థాన్, జైపుర్‌లో ఈ విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. అల్వార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
లోకేశ్ మీనా(22), రాహుల్(19) రూప్బాస్ పట్టణంలో వారి అక్క ఇంటి దగ్గరే ఉండి కాంపీటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వారి తండ్రి జిల్లాలోని తెల్హా గ్రామంలో నివసిస్తున్నారు. సోదరులు ఫ్రీ టైమ్ లో పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్లో పబ్జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ రూట్ లో ట్రైన్ వచ్చింది. రైలును గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇరువురూ స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.