
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు బెంగుళూరులో నమోదవుతున్నాయి. నగర వ్యాప్తంగా కంటైన్మెంట్జోన్లు పెరిగాయి. తాజాగా 15 వేలకు పైగా బెంగళూరులో కేసులు నమోదు కావడం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. దేశానికే కరోనా హాట్‌స్పాట్‌గా ఐటీ నగరి నిలిచింది. నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 10,800 మందికి వైరస్ నిర్ధారణ కాగా బుధవారం 15,600 మందికి పైగా ప్రబలింది. వైరస్ బాధితులు పెరుగుతుండగా పాజిటివిటీ రేటు కూడా అధికమవుతోంది. 5 శాతం పాజిటివిటీ రేటు దాటితే ప్రమాదానికి సంకేతమనే అభిప్రాయాలు ఉండగా ప్రస్తుతం ఏకంగా 15 శాతానికి చేరువలో ఉండడం నగర ప్రజలను కలవరపెడుతోంది.
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నా బెంగళూరులో కేవలం పదిరోజుల వ్యవధిలోనే అనూహ్యంగా వందలనుంచి వేలదాకా చేరాయి. డిసెంబరులో 5వేలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 70వేలకు చేరాయి. ఎక్కువ మంది హోం ఐసొలేషన్‌లోనే గడుపుతున్నందున ఆసుపత్రులపై ఒత్తిడి రాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాల జబ్బులతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ రెండోవిడతలో పడకలు, ఆక్సిజన్, అంబులెన్స్‌లు, ఐసీయూ విభాగంలో చేరేందుకు కష్టాలు తెలిసిందే. చివరకు శ్మశానంలోనూ అంత్యక్రియలకు రోజుల తరబడి వేచియున్నారు. కొవిడ్ థర్డ్‌వేవ్‌లో నగరంలో వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నందున పూర్తిగా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలంటే కష్టతరమని ప్రజల్లోనూ చైతన్యం ఉండాల్సిందేనని బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. కాగా కొవిడ్ నిబంధనలను ఈనెల 31వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ప్రబలిన చిన్నారులకు తాలూకా, జిల్లా ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక విభాగాలు తెరిచే తరహాలోనే బెంగళూరులోనూ అమలు చేయాలను కుంటున్నారు. పిల్లలకు అవసరమైన మందులు, ఆసుపత్రిలో సౌలభ్యాలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి బొమ్మై బుధవారం మరోసారి అధికారులకు సూచించారు. నగరంలో కొత్తగా 27 కొవిడ్‌కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నగరంలో కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీసినట్టు తెలుస్తోంది.