
కన్నపిల్లలపై తల్లిదండ్రులు పెంచుకునే ప్రేమ మామూలుగా ఉండదు.. పిల్లలకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అమ్మ ప్రేమ బయట కనిపించినా, నాన్న ప్రేమ మాత్రం బయట కనబడకున్నా విలువకట్టలేనంతగా ఉంటుంది.. కుటుంబం కోసం, పిల్లల కోసం తన జీవితాన్నే సర్వస్వం ధారపోస్తాడు తండ్రి. అలాంటిది కన్న కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఒక తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక అంబేద్కర్ నగర్లో భార్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తనయుడు గత కొంతకాలంగా మూర్చవ్యాధితో సతమతమవుతున్నాడు. ఆరోగ్య సమస్యలు తీవ్రం అవ్వడంతో.. గురువారం మరణించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తనయుడి మృతిని లక్ష్మణ్ జీర్ణించుకోలేకపోయాడు. బిడ్డ లేకుండా తాను బ్రతకలేనంటూ మనసులో కుమిలిపోయి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర నైరాశ్యం నెలకుంది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంబేద్కర్ నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి.