
దేశంలో ఎవరూ ఊహించని సంచలనాలను పంజాబ్‌లో సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ.. చాప కింద నీరులా వ్యాపిస్తూ ఆఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో ఆప్ పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తెలంగాణలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేజ్రీవాల్ హైదరాబాద్‌లోనే పాదయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ యువతతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణా సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణకు ఆప్ తరపున బాధ్యతలను సోమ్‌నాథ్ భారతి చూస్తున్నారు. ఆయన యువత, మాజీ అధికారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దానితో పాటు పాదయాత్రలను ప్లాన్ చేస్తున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ కారణంగా కేజ్రీవాల్ ముందుగానే తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి భేటీ నిర్వహించలేదు. ఆ తర్వాత ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతిపై విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. ఈ ప్రకటనతో కేజ్రీవాల్, కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాలు అస్సలు లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే తెలంగాణలో ఆప్ అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఆప్ తెలంగాణలో అడుగు పెట్టాలన్న వ్యూహంలో మరో కోణం కూడా ఉందని భావిస్తున్నారు. పంజాబ్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉంది. పోటీ ఇచ్చే స్థితిలోఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ను దెబ్బకొడితే ఆ స్థానం తమకు వస్తుందని.. ఆప్ అంచనాలు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. తెలంగాణలో ఎవరికి అనుమానం రాకుండా ఇప్పటికే ఆప్ బృందం పర్యటిస్తూ తమ పని తాము చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. పంజాబ్ మాదిరిగా తెలంగాణలో కూడా ఆప్ పార్టీ కూడా ఏమైనా సంచలనాలు చేసే అవకాశం ఉందా, లేదా అనేది ముందు ముందు పరిస్థితులను బట్టి అర్థమవుతోంది..