
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కమలం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అమిత్‌షా ఆధ్వర్యంలోని ఒక బృందం ప్రత్యేక ఆపరేషన్‌కు కూడా సిద్దమైనట్లుగా ప్రచారం ఊపందుకుంది. వరి పోరు లాంటి వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న గులాబీ దళపతి కెసిఆర్‌కు ఢిల్లీ నుంచే కళ్లెం వేయాలని కమలనాథులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అమిత్ షా డైరెక్షన్ లో ప్రత్యేక టీమ్‌లతో తెలంగాణలో భారీ ఆపరేషన్ చేపట్టినట్లుగా ప్రచారం జోరందుకుంటుంది.
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత రెండో అగ్రనాయకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రత్యక్ష పర్యవేక్షణలో కమల దళం ‘మిషన్ తెలంగాణ’ అమలుకు చర్యలు మొదలుపెట్టిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నిలబెట్టడమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధమైందని, అజెండాను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మెరికల్లాంటి ఎమ్మెల్యేలను రప్పించినట్లు ప్రచారం సాగుతోంది. అమిత్ షా నిర్దేశం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన 26మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి తెలంగాణకు పంపినట్లు తెలుస్తోంది. ఆ 26 మందిలో ఒక్కొక్కరిని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంచార్జీలుగా నియమించారని, 2023 ఎన్నికలు ముగిసేదాకా సదరు నేతలంతా పూర్తిగా తెలంగాణలో పనిచేస్తారని, పార్టీ ఆలోచనలు, ప్రచార వ్యూహాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమనే అంశాలపైనే వారు పనిచేస్తారని వెల్లడవుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆ 26 మంది నేతలకు తోడు, స్థానిక నేతల్లో టికెట్లు ఆశించకుండా, కేవలం పార్టీ కోసమే పనిచేయాలనుకునే వారి సేవలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని 119 నియోజకవర్గాల వారీగా బీజేపీ నేతల్లో సమన్వయం కోసం.. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని, పార్టీ కోసం పనిచేసే సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించనున్నారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే బీజేపీ తెలంగాణలోనూ రిజర్వుడు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే 19ఎస్సీ, 12ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యా చరణ నిమిత్తం అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో రెండు ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించింది. ఇతర రాష్ట్రాల వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కార్యచరణను అమలు చేయవచ్చని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమిత్ షా తలపెట్టిన మిషన్ తెలంగాణను ఎక్కువ శాతం ఢిల్లీ నుంచే ఆపరేట్ చేస్తున్నారని, తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలన్నిటినీ అమిత్ షాకు నేరుగా రిపోర్ట్ చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజల మనోభావాలు, బీజేపీ పట్ల అభిప్రాయాలు, టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎంచుకునే పోరాట రూపాలు తదితర వివరాలన్ని ఎప్పటికప్పుడు నేరుగా అమిత్‌షాకే నివేదికలు అందించేలా వివిధ బృందాలు పనిచేస్తున్నాయి. పలు అంశాలపై సర్వేల ద్వారానూ గ్రౌండ్ లెవల్ ఇన్ఫోను అమిత్‌షా కార్యాలయానికి చేరవేస్తున్నట్లు వెల్లడైంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవేసేలా పకడ్బందీ ప్రణాళికలతోనే ముందుకు సాగుతున్నారని, అసమ్మతులు, ఆశావాహులను సైతం తమ దారికి తెచ్చుకునేలా అమిత్‌షా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.