
ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివితే.. చదివిన చదువుకు సరిపడ ఉద్యోగమే రాని పరిస్థితి ఉంది.. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చాలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఎకనామిక్స్ చదివిన 24 ఏళ్ల పట్టభద్రురాలు ఉద్యోగం కోసం అంతటా వెతికి, అన్ని దరఖాస్తులు చేసి చివరికి టీ స్టాల్ పెట్టి ఆనందంగా జీవిస్తోంది..
బీహార్‌లోని పాట్నాకు చెందిన 24 ఏళ్ల ప్రియాంక గుప్తా 2019 లో ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. రెండేళ్ల పాటు ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు కూడా చేసింది. ‘ఎంబీఏ చాయ్‌వాలాగా’గా పిలిచే ప్రఫుల్ బిల్లోర్ని స్ఫూర్తిగా తీసుకుంది. తాను కూడా ఎందుకు టీస్టాల్ పెట్టకూడదని ఆలోచించింది. దీంతో టీ స్టాల్ ఏర్పాటు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగానని తనకు ఎవరూ లోన్ ఇవ్వలేదని… అప్పుడు స్నేహితులు ముందుకొచ్చి.. వారు రూ. 30 వేలను సాయం చేయడంతో ఈ షాప్ ఏర్పాటు చేశామని ప్రియాంక చెపుతోంది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. ఏప్రిల్ 11న టీ స్టాల్‌ను స్టార్ట్ చేసింది. రెగ్యులర్ టీతో పాటు పాన్, మసాలా, చాక్లెట్ టీ, బిస్కెట్లు అమ్ముతోంది. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం పెట్టింది. ‘పీనా హీ పడేగా’ (తాగాల్సిందే), ‘సోచ్ మత్.. చాలూ కర్దే బస్’ (ఆలోచించకు.. మొదలుపెట్టు బాస్) వంటి కొటేషన్స్ తో ఉండే బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్ లో కప్పు టీ రూ.15 నుంచి రూ.20 వరకు ఉంది.
దీనిపై ప్రియాంక మాట్లాడుతూ ఎప్పుడూ నీడపాటున ఉండే నేను.. ఇప్పుడు రోజంతా మండిపోయే వాతావరణంలో స్టాల్‌ను నడిపిస్తున్నా. సక్సెస్ఫుల్ ‘చాయ్వాలీ’గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నానని ప్రియాంక తెలిపింది. నెటిజన్లు ప్రియాంక ప్రయతంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు బీహార్‌లో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని అంటుంటే.. మరికొందరు.. రాబోయే కాలంలో ప్రియాంక బిజినెస్ లో మరింత సక్సెస్ అందుకుని మరికొంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.