
ప్రతి మనిషికి తనకు చిన్నదో, పెద్దదో ఒక స్వంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది.. ఆ కల నెరవేర్చుకునేందుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉంటారు. తమకు తోచినంతగా ఇల్లు కూడా నిర్మించుకుంటారు. ఆ ఇల్లు గృహప్రవేశం రోజు బంధువులు, స్నేహితులను అందరిని పిలిచి పూజలు, హోమాలు చేస్తారు. దానితో పాటు గృహప్రవేశం సమయంలో కొత్త ఇంట్లోకి ముందుగా గోమాతని తీసుకెళతారు. ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని తన ధర్మపత్నితో సహా దేవుడి ఫొటో పట్టుకుని లోపలకు అడుగుపెడతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా లోపలకు వెళతారు. పూర్వీకుల నుంచి ఇదే ఆచారం కొనసాగుతోంది. గోమాతని సకలదేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకే ముందుగా గోవులను కొత్తింట్లోకి తీసుకెళ్లడం ద్వారా సకలదేవతలూ ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టే అని విశ్వసిస్తారు. నూతన గృహంలో మూత్రం, పేడ వేసినట్టైతే మరింత శుభకరంగా భావిస్తారు.
శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ, ఇన్ఫెక్షన్లూ, దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడా, మూత్రం, నెయ్యీ, పెరుగూ, పాలూ… అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని వ్యర్థాలను పారదోలుతుంది. అందుకే గృహప్రవేశం సమయంలో ఆవుకి అంత ప్రాధాన్యతనిస్తారు.