
జీవితంలో ఎప్పుడు, ఏలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు. జరిగిన సంఘటనలు తలచుకొని కొంతమంది కుమిలి పోతుంటే, మరికొంతమంది ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందడుగు వేస్తారు. అలాంటిది బీహార్ లోని ఒక బాలిక రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కొల్పోయిన ఒంటి కాలుతో ప్రతిరోజు పాఠశాలకు వెళుతోంది. ఆ సంఘటన యావత్తు సమాజాన్ని కదిలించింది.
బీహర్ జముయ్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి పది సంవత్సరాల సీమ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. ఇప్పుడు ఆమెకు కేవలం ఒక కాలు మాత్రమే ఉంది. కానీ ఆ విషాదం నుంచి సీమ చాలా తొందరగానే బయటపడింది. కాలు పోయిన కారణంగా తన చదువును ఆపలేదు. ఒంటి కాలితో గెంతుతూ ఒక కిలోమీటర్లో దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతిరోజూ వెళ్తుంది. ఇంత కష్టంలో కూడా చదువు పట్ల సీమకు ఉన్న ఆసక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా తన గ్రామంలో ఇతర బాలికలను కూడా చదువుకోమని ప్రోత్సహిస్తుంది.
స్కూల్ యూనిఫామ్‌లో ఒంటికాలితో స్కూల్‌కు వెళ్తున్న సీమ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బాలిక ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోపై సినీ నటుడు సోనూ సూద్ కూడా వెంటనే స్పందించారు. ఆ అమ్మాయికి సాయం చేస్తానని చెప్పి మరోసారి ఆయన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు. “ఇప్పుడు నువ్వు ఒక కాలితో కాదు.. రెండు కాళ్లపై పాఠశాలకు వెళ్తావు. మీకు టికెట్ పంపుతున్నాను. ఇప్పుడు రెండు కాళ్లపై నడవడానికి సమయం ఆసన్నమైంది” అని హిందీలో పేర్కొన్నారు. దీంతో సోనుసూద్‌పై కూడా నెటిజన్లు ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల సీమ వీడియోపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. దేశభక్తులందరికీ సీమ స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలవాలంటూ ట్వీట్ చేశారు. “పదేళ్ల సీమ ఆసక్తి నన్ను భావోద్వేగానికి గురి చేసింది. దేశంలోని ప్రతి చిన్నారికి మంచి చదువు కావాలి. నాకు రాజకీయాలు తెలియవు, ప్రతి ప్రభుత్వానికి కావలసినన్ని వనరులు ఉన్నాయని నాకు తెలుసు. సీమ వంటి ప్రతి బిడ్డకు అత్యుత్తమ విద్యను అందించడం ప్రతి నిజమైన దేశభక్తుని లక్ష్యంగా ఉండాలి. అదే నిజమైన దేశభక్తి అని ట్వీట్లో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే బీహార్ మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి కూడా సీమ వీడియోను షేర్ చేశారు. సీమకే కాదు.. అలాంటి చిన్నారులకు తగిన సహాయం చేస్తామన్నారు.
మరోవైపు జముయ్ జిల్లా మెజిస్ట్రేట్ కూడా సీమకు ట్రై సైకిల్‌ను బహుమతిగా అందజేశారు. ఆమెకు కృత్రిమ అవయవాన్ని అందజేస్తానని హామీ కూడా ఇచ్చారు. సీమ ధైర్యంపై నెటిజన్లు కూడా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి పిల్లలకు అండగా ఉండాలని కామెంట్లు పెట్టారు.