నీటికోసం ప‌ర్వతాన్ని తొలిచాడు.. ఏడు సొరంగాలు తవ్వాడు..

Share On

మనిషికి కృషి ఉంటే ఏదైనా చేయోచ్చు అంటారు.. కృషికి తోడు సాధించాల‌నే ప‌ట్టుద‌ల అత‌డిని గొప్ప వ్య‌క్తిగా మ‌లిచింది. ఎంతోమంది హేళ‌న చేసి, అవ‌మాన‌ప‌రిచినా అవేమి ప‌ట్టించుకోకుండా ఒంటి చేత్తో ప‌ర్వ‌తాన్ని తొలిచి ఏడు సొరంగాలు త‌వ్వాడు.. అత‌ని క‌ష్టానికి కొండ‌కూడా త‌ల‌వంచింది.. నీళ్లు ఇచ్చింది. అత‌ను చేసిన పోరాటానికి ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది.. అత‌నే నేటి త‌రానికి స్పూర్తి 70ఏళ్ల మ‌హాలింగ నాయ‌క్‌..

చి న్నప్పటి నుంచీ అత‌నికి రైతు కావాల‌ని కల… ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకే ఇంత ప‌నిచేశామ‌ని చెపుతున్నాడు మ‌హాలింగ నాయ‌క్‌.. ఊహవచ్చినప్పటి నుంచీ నాయక్‌ది రైతుకూలీ జీవితమే. పదేళ్ల వయస్సులోనే ఎత్తయిన కొబ్బరిచెట్లు, పోకచెట్లెక్కి కాయలు కోయడం నేర్చుకున్నాడు. ఎండ, వాన‌ అనకుండా శ్రమించి తన యజమానికి నమ్మినబంటయ్యాడు. త‌న య‌జ‌మానిలా రైతు కావాల‌నుకున్నాడు. కానీ తనకంటూ ఉండటానికి గుడిసె కూడా లేనివాడు… రైతు ఎలా అవుతాడు, ఏదో వింత జరిగితే తప్ప! అలాంటి అనుకోని వింత 1978లో జరిగింది. పాతికేళ్లుగా తన దగ్గర కూలీగా ఉంటున్నాడన్న దయతో ఆ రైతు మహాలింగనాయక్‌కి రెండెకరాలు ఇచ్చి వెళ్లిపోయాడు. ‘ఇక నేనూ రైతునే!’ అని సంబరపడిపోతున్న నాయక్‌ని చూసి ‘ఇల్లలకగానే పండగైపోదు. మీ రైతు నీకిచ్చిన నేలలో గడ్డికూడా మొలవదు!’ అన్నారట స్నేహితులు. వాళ్ల మాటల్లో నిజం లేకపోలేదు…

నాయక్‌కి దక్కిన భూమి ఉండేది ఒక‌ కొండపైన… అదీ శిఖరానికి దగ్గరగా! అలాంటిచోట సాగుకి కాదుకదా… కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకవు. రాతి నేల కాబట్టి బావులూ కుంటలూ తవ్వే వీలూ లేదు. అయినా… అక్కడే మొండిగా గుడిసె వేసుకున్నాడు నాయక్‌. పెళ్ళి కూడా చేసుకున్నాడు. అరకిలోమీటరు దూరం వెళ్లి తాగు నీళ్లు తెచ్చుకునేవాడు. ఆ నీటి సమస్య తీరడమెట్లా అని సదా ఆలోచిస్తుండేవాడు. అప్పుడే ఈ ప్రాంతంలోనివాళ్లు అనుసరించే ఒక‌ పాతపద్ధతి గురించి అతనికి తెలిసింది. మామూలుగా మనం నీటి కోసం బావులు తవ్వుతాం కదా… కానీ కర్ణాటక పశ్చిమ కోస్తాలోని ఈ పర్వతప్రాంతంలో నీటి కోసం కొండల్ని తొలిచి సొరంగాలు చేస్తారు! ఆ పద్ధతిని ఇప్పుడెవరూ పాటించకున్నా… బీడుపడిపోతున్న తన రెండెకరాల కోసం నాయక్‌ తానూ కొండల్లో సొరంగం తవ్వాలనుకున్నాడు. ఉపాధి కోసం రోజంతా కూలికెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక‌ గొడ్డలితో కొండని తొలిచేవాడు. ఇతను తొలుస్తూ ముందుకెళుతుంటే భార్య లలిత… వెనకే గంపతో వచ్చి మట్టి తీస్తూ ఉండేది. ఇద్దరూ రాత్రి పదకొండుదాకా ఇలా పనిచేసేవారు. అలా ఏడాదిపాటు తొలిచి 35 మీటర్ల సొరంగం చేశాడు. అంత చేసినా, కొండలో నీటి జాడ కానరాలేదు. నాయక్‌ నిరాశపడ్డా… ప్రయత్నం మానలేదు. మరో చోట తొలవడం మొదలుపెట్టాడు. అక్కడా ఏడాది కష్టం వృధా అయింది. మరో రెండేళ్ల తర్వాత మరో రెండు సొరంగాలు తయారైనా చుక్కనీరూ కానరాలేదు. ఈలోపు ఊళ్లోవాళ్లందరూ నాయక్‌ని పిచ్చివాడికిందే జమకట్టేయడం మొదలుపెట్టిన నాయ‌క్ ప‌ట్టువీడ‌లేదు. నాయక్‌ ఐదో సొరంగం తవ్వుతున్నప్పుడు తొలిసారి పైకప్పుపైన నీటి చెమ్మ కనిపించింది. దాంతో ఒక‌ అంచనాకి వచ్చిన నాయక్‌ ఈసారి కొంత ఎత్తు నుంచి తవ్వడం ప్రారంభించాడు. ఆ ప్రయత్నంలో 65వ మీటరు వద్ద ఈసారి జల… ఒక‌ సన్నటి ధారలా ప్రత్యక్షమైంది. ఆ నీటి ధారని బట్టి, ఆరో సొరంగం నుంచి పక్కకెళ్లి… ఏడో సొరంగం తవ్వాడు. ఈసారి నీరు… ఒక‌ పెద్ద ఊటలా పొంగి అతని కాళ్లని తడిపింది! ఇంకేముంది… రాత్రికి రాత్రే వెదురుబొంగుతో ఆ నీటిని మళ్ళించే ప్రయత్నం మొదలుపెట్టాడు. వాటిని నిల్వచేయడానికి ఒక‌ భారీ తొట్టెని నిర్మించుకున్నాడు. మండువేసవిలో కూడా రోజుకి మూడువేల లీటర్ల నీరు ఉంటాయట ఆ తొట్టెలో!

ఆయ‌న కృషికి ప‌ద్మ‌శ్రీ ల‌భించింది..

ఎనిమిదేళ్లపాటు కొండని తవ్వి తెచ్చిన నీటితో నాయక్‌… తన రెండెకరాల స్థలంలో మూడొందల పోకచెట్లు, 75 కొబ్బరి, 150 జీడిమామిడి, రెండువందల అరటి చెట్లని పెంచగలిగాడు. కొండమీది నుంచి నీరు కేవలం గురుత్వాకర్షణతోనే వస్తుండటంతో మోటార్ల కోసం కరెంటూ డీజిలూ వంటివాటి అవసరం రాలేదంటాడు నాయక్‌! కర్ణాటకలోని విఠల-కాసర్గోడు హైవే పక్కన… మంగళూరుకి 55 కిలోమీటర్ల దూరంలో ఆద్యనాదక్‌ అన్న గ్రామంలో ఉంటున్న మహాలింగ నాయక్‌ పొలం ఇప్పుడు చుట్టుపక్కల రైతులకి ఒక‌ సందర్శనీయ ప్రాంతం. ఆ మధ్య భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) కూడా నాయక్‌ చేసిన కృషిపైన ప్రత్యేక పరిశోధనే చేసింది. ఆ పరిశోధనే మహాలింగనాయక్‌ని పద్మశ్రీ దాకా తీసుకెళ్లింది!


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu