
చాలా ప్రాంతాలలో పది రూపాయల నాణెలు చెల్లడం లేదని తీసుకొవడం లేదు. అలాంటిది ఒక సామాజిక కార్యకర్త పది రూపాయల నాణెలపై అవగాహన కల్పించేందుకు ఆరు లక్షల పది రూపాయల నాణెలతో కారు కొనుగోలు చేశారు.
ధర్మపురికి చెందిన వెట్రివేల్ (27) ఒక ప్లే స్కూల్ నడుపుతున్నారు. ఈయన సామాజిక కార్యకర్త. ఈయన సేలం సూరమంగలం వద్ద కార్ల షోరూమ్‌లో రూ.6 లక్షల విలువైన కారు కొనుగోలు చేయడానికి బుక్ చేసుకున్నారు. ఆ విలువకు సమానమైన రూ.10 నాణేలను మూటలో తీసుకొచ్చి షోరూమ్ సిబ్బందికి ఇచ్చారు. వాటిని తీసుకున్న సిబ్బంది ఆయనకు కారు అప్పగించారు. దీనిపై వెట్రివేల్ మాట్లాడుతూ.. తన పాఠశాలలో చదివే విద్యార్థులు రూ.10 నాణేలతో ఆడుకుంటున్నారని, వాటితో ఎందుకు ఆడుకుంటున్నారని వారిని అడగ్గా.. అవి చెల్లవని చెప్పారన్నారు. అందువల్ల అవి చలామణి అవుతాయని ప్రజలకు అవగాహన కల్పించేందుకు నాణేలను సేకరించి కారు తీసుకున్నట్లు తెలిపారు.