
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి నుంచి బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము చీపురుపట్టి రాయ్రంగ్పూర్లో ఒక శివాలయాన్ని శుభ్రం చేశారు. చీపురుతో ఆలయ పరిసరాలను ఊడ్చారు. అనంతరం శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు జగన్నాథ్ ఆలయంలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ద్రౌపది ముర్ము. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఆమెకు భద్రతను పెంచింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. కేంద్రహోంశాఖ పరిధిలోని సీఆర్పీఎఫ్ సిబ్బంది ఇకపై ఆమెకు నిరంతరం సెక్యూరిటీగా ఉంటారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని(Odisha) ఓ సాధారణ ఆదివాసీ గిరిజన మహిళ స్థాయి నుంచి రాష్ట్రమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఆమెకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళకు ఆదివాసీలకు అత్యున్నత స్థానం ఇవ్వడంతో పాటు ఓ మహిళకు దేశ అత్యున్నత పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావించింది. విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 27న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.