
బుధవారం తెల్లవారుజామున అప్ఘానిస్తాన్‌లో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య వందల్లో పెరుగుతోంది. ఈ ప్రమాద ఘటనలో 1,000 మందికిపైగా మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి సంఖ్య 1,500పైగా ఉంటుందని తెలిపారు. ‘మృతుల సంఖ్య పెరుగుతోంది. దాంతో వరుసపెట్టి సమాధులు తవ్వుతూనే ఉండాల్సి వస్తోంది’ అని స్థానిక అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సమాచార లోపం నెలకొంది. సహాయ కార్యక్రమాలకూ ఆటంకం కలుగుతోంది. దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్‌లో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అక్కడి మీడియాలో వస్తున్న దృశ్యాలు భూకంప తీవ్రతను కళ్లకుగడుతున్నాయి. ఇళ్లు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సహాయం కోసం అర్థించే పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని అఫ్గాన్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలను ఈ భూకంపం మరింత దారుణ స్థితిలోకి నెట్టేసింది.