
అతనిని ప్రపంచ మీడియాలో ఒక దిగ్గజం.. అందరూ అతనిని మీడియా మొఘల్‌గా పిలుస్తారు.. అతనే 91సంవత్సరాల రూపర్డ్ మర్దోక్.. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకొని విడాకులు తీసుకున్న అతను ఇప్పుడు నాలుగో విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యాడు. అతను నటి జెర్రీ హాల్ నుంచి ఆయన విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువురి సన్నిహితులు వెల్లడించిన వివరాల ఆధారంగా న్యూయార్స్ టైమ్స్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.
న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ 2016లో జెర్రీ హాల్ (65)ను వివాహం చేసుకున్నారు. తన కంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్.. ప్రముఖ అమెరికన్ నటి, మోడల్. వీరి విడాకుల వార్తలపై స్పందించడానికి ఇరువురి ప్రతినిధులు నిరాకరించగా, వారి సన్నిహితులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మర్దోక్ ఇప్పటికే పాట్రిషియా బుకర్, అన్నా మరియా మన్, వెండీ డెంగ్‌తో విడిపోయారు.
మర్దోక్ తన రెండో భార్య మన్ నుంచి విడిపోతున్నప్పుడు చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విశాలమైన మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ ఇటీవల లెక్కకట్టింది.