
పెళ్లి అంటే భార్యభర్తలు ఆనందంగా కలిసి ఉంటారు.. గొడవలు పెద్దగా మారినప్పుడు విడాకులు తీసుకొని ఎవరికి వారు విడిపోయి వారి ఇష్టాన్ని బట్టి మరొక పెళ్లి చేసుకుంటారు.. కాని ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని తొమ్మిది పెళ్లి దగ్గర దొరికిపోయింది.
కృష్ణా జిల్లా గుంపలగూడెంకు చెందిన వ్యక్తి పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు నమోదు చేసుకున్నాడు. అదే సైట్ లో మెహబూబాబాద్ కు చెందిన స్వప్న ప్రొఫైల్ అతడికి నచ్చింది. ఇద్దరూ మాటలు కలిపారు. స్వయంగా స్వప్న తన కుటుంబ సభ్యులతో కలిసి గుంపలగూడెం వచ్చి పెళ్లి సెట్ చేసుకుంది. అలా పెళ్లి చేసుకొని బెంగళూరులో కాపురం పెట్టారు. ఐతే భార్య ఎప్పుడూ ఫోన్లో కోర్టు కేసులు, లాయర్ అంటూ మాట్లాడుతుంటే భర్త గమనించాడు. అడిగితే స్వప్న విసుక్కునేది. ఒకరోజు హఠాత్తుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్పి వెళ్లిపోయింది. 2 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఆ వెంటనే మరోసారి హైదరాబాద్ వెళ్లాలంటూ బయల్దేరింది. దీంతో భర్తకు అనుమానం వచ్చింది. ఈసారి తను కూడా హైదరాబాద్ బయల్దేరాడు. భార్యకు తెలియకుండా ఆమెను ఫాలో అయ్యాడు.
హైదరాబాద్ వెళ్లిన స్వప్న నేరుగా కోర్టుకు చేరుకుంది. అప్పుడు భర్తకు అసలు విషయం తెలిసింది. స్వప్నకు అప్పటికే 8 పెళ్లిళ్లు అయ్యాయి. వాటికి సంబంధించిన విడాకుల కేసుల విచారణ కోసం ఆమె కోర్టుకు హాజరవుతోంది. ఈమెను పెళ్లి చేసుకున్న వారిలో ఇప్పటికే కొంతమంది మరణించారు. విషయం తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. స్వప్నను నిలదీశాడు. అప్పటికే ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చూసిన స్వప్న తిరగబడింది. రివర్స్ లో భర్తపైనే కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. స్వప్న ఏడుపు చూసి మెహబూబాబాద్ పోలీసులు నిజం అనుకున్నారు. కానీ భర్త వచ్చి అసలు విషయం చెప్పాడు. అంతకుముందు జరిగిన 8 పెళ్లిళ్ల వివరాలను సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించాడు. దీంతో స్వప్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించే పనిలో పడ్డారు. ఇలా నిత్యపెళ్లికూతురు బాగోతం బయటపడింది.