
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
స్థానికుల కథనం ప్రకారం.. డ్రైవర్ సహా తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్‌తో పాటు 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులను కుమారి(35), రత్నమ్మ(35), రాములమ్మ(35), లక్ష్మి లక్మీదేవి(32), కాంతమ్మ(32)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.