పాఠ‌శాల‌ను క‌బ్జా చేసి ఇంటిగా మార్చుకున్న వైకాపా నేత‌..

Share On

విద్యార్ధుల‌ను బావిభార‌త పౌరులుగా తీర్చిదిద్దే పాఠ‌శాల‌ను ఒక రాజ‌కీయ నాయ‌కుడు అక్ర‌మించుకొని ఏకంగా ఇంటిగా మార్చేసుకున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం ప‌ట్ట‌ణంలోని ఇందిరాన‌గ‌ర్‌లో ఉండే పాఠ‌శాల‌ను క‌బ్జా చేశాడు. 2013 జూన్‌లో రాజీవ్‌ విద్యా మిషన్‌ నిధులు రూ.5.30లక్షలతో పాఠశాలను ప్రభుత్వం నిర్మించింది. క్రమంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో అక్కడి విద్యార్థులను వేరే పాఠశాలకు మార్చారు. దీంతో ఐదేళ్ల క్రితం పాఠశాలను మూసివేశారు. అప్పటినుంచి పాఠశాలపై స్థానిక వైకాపా నేత దృష్టిపడింది. పాఠశాల శిలాఫలకం, బోర్డు తొలగించి తన ఇంటిగా మార్చుకొని రెండు పడక గదులు, వంట గది, హాలు, బయట బాత్‌రూమ్‌లు, మెట్లు నిర్మించారు. ఈ విషయం తెలిసినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

”స్థానిక వైకాపా నేత పాఠశాల భవనాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడంలేదు. భవనంలో రెండు పడక గదులు, వంట గది, హాలు, బయట బాత్‌రూమ్‌లు, మెట్లు నిర్మించారు. సర్పంచి పల్లవి బంధువులు పాఠశాల ఆక్రమణపై దృష్టి పెట్టారు. నిర్మాణాలు సాగుతున్నా అధికారులు అటువైపు చూడటం లేదు. ఈ విషయంపై సమాచారమిచ్చినా అక్కడకు వెళ్లి నిర్మాణాలను అడ్డుకునేందుకు భయపడుతున్నారు. పాఠశాలను కాపాడుకోవాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం దారుణం. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామ‌ని తెదేపా నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ అన్నారు.

పాఠశాల భవనం ఖాళీగా ఉందని, నిర్మాణాలు చేపట్టింది ఎవరో తెలియదన్నారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే భవనానికి తాళాలు వేయిస్తామని ఎంఈవో తెలిపారు. అనంతరం భవనానికి తాళాలు వేయించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu