ఆ రాణి అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మామూలుగా లేవు..

Share On


చావు అంటే అది.. మరణించాక కూడా ఎవరూ ఊహించలేని విధంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జరగనున్న బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడి ప్రభుత్వం కనీవిని ఎరగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రముఖులు, లక్షల మంది బ్రిటన్‌ పౌరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు అంచనా. రాజరికం ఉట్టిపడేలా కట్టుదిట్టమైన భద్రత నడుమ.. లక్షలాది మంది పౌరులు చూస్తుండగా లండన్‌ వీధుల్లో రాణి ఎలిజబెత్‌ అంతిమ యాత్ర కొనసాగనుంది. సెప్టెంబర్‌ 8న కన్నుమూసిన రాణి ఎలిజబెత్‌కు తుది నివాళి అర్పించేందుకు లండన్‌తోపాటు యూకే వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లను చేశారో ఓసారి చూద్దాం.

2000 ప్రముఖులు: వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో మొదలయ్యే రాణి ఎలిజబెత్‌2 అంత్యక్రియల కోసం ప్రపంచ వ్యాప్తంగా 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాజు చార్లెస్‌ III మొదలు, ఇతర రాజకుటుంబాలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వంటి నేతలు హాజరుకానున్నారు.

800 అతిథులు: వీరితోపాటు వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 800 మంది అతిథులు సెయింట్‌ చాపెల్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌ వద్ద నివాళులర్పించనున్నారు.

*5949 సైనికులు: 5949 మంది సైనికులు రాణి అంత్యక్రియల కోసం ఇప్పటికే విధులు నిర్వర్తిస్తుండగా.. వీరిలో 4416 మంది ఆర్మీ, 847 మంది నేవీ, మరో 686 మంది వాయుసేన సిబ్బంది ఉన్నారు. వీరికి అదనంగా కామన్వెల్త్‌ దేశాలకు చెందిన 175 మంది సాయుధ బలగాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

1650 సైనిక సిబ్బంది: వెస్ట్‌మిన్‌స్టర్‌ అబే నుంచి వెల్లింగ్టన్‌ ఆర్చ్‌ వరకు కొనసాగే అంతిమయాత్రలో దాదాపు 1650 సైనిక సిబ్బంది పాల్గొంటారు. మరో వెయ్యి మంది మాత్రం అంతిమయాత్ర కొనసాగే మార్గంలో వీధుల వెంట పహారాలో ఉంటారు.

10వేల మంది పోలీసులు: లండన్‌ చరిత్రలోనే తొలిసారిగా భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 10వేల మంది సిబ్బంది సోమవారం విధుల్లో ఉంటారని లండన్‌ పోలీసులు వెల్లడించారు.

36కి.మీ బారికేడ్లు: రాణి అంతిమయాత్ర కోసం లక్షలాది పౌరులు తరలిరానున్న నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లు నిర్మించారు. కేవలం ఒక్క సెంట్రల్‌ లండన్‌లోనే సుమారు 36కి.మీ పొడవున వీటిని ఏర్పాటు చేశారు.

10లక్షల మంది: సోమవారం జరిగే రాణి అంత్యక్రియలకు సుమారు 10లక్షల మంది పౌరులు హాజరు కానున్నట్లు అధికారుల అంచనా. ఇందుకోసం నగరవ్యాప్తంగా 250 రైళ్ల సర్వీసులను అదనంగా నడిపిస్తున్నారు.

8 కి.మీ మేర క్యూలైన్‌: ప్రస్తుతం వెస్ట్‌మిన్‌స్టర్‌లో ఉన్న రాణి భౌతిక కాయాన్ని చూసేందుకు సుమారు 8కి.మీ మేర పౌరులు క్యూలైన్లో వేచి ఉన్నారు. సోమవారం ఉదయం వరకూ ఇంతటి రద్దీ కొనసాగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

125 థియేటర్లు: సోమవారం జరిగే రాణి అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు 125 థియేటర్లలో ఏర్పాట్లు చేశారు.

*2868: ముత్యాలు, కెంపులతోపాటు మొత్తం 2868 వజ్రాలు రాణి శవపేటికపై ఉంచనున్నట్లు సమాచారం.

2 నిమిషాల మౌనం: వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేలో జరిగే అంత్యక్రియల సమయంలో దేశవ్యాప్తంగా రెండు నిమిషాల మౌనం పాటించనున్నారు


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu