ఇరాన్‌లో హిజాబ్ వ్య‌తిరేకిస్తూ రోడ్డెక్కిన మ‌హిళ‌లు..

Share On

ఇరాన్‌లో హిజాబ్‌ను వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున మ‌హిళ‌లు రోడ్డెక్కారు. ఇటీవ‌ల పోలీసు క‌స్ట‌డీలో ఒక మ‌హిళ మృతిచెంద‌డంపై తీవ్ర వివాదానికి దారితీసింది. ఆవిడ మృతితో ఇరాన్ మ‌హిళ‌లు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. పలువురు మహిళలు తమ జట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్‌ ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ఏడాది జులైలో అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు జరిమానాలతో పాటు అరెస్టులు కూడా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మొరాలిటీ పోలీసు’ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్నఆమె గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ గత శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించారని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. కానీ, ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.

ఈ క్రమంలోనే అమిని మృతిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అనేక మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అటు అమిని స్వస్థలంలోనూ నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు. బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu