
గంజాయి రవాణా చేసే స్మగ్లర్లులు, విక్రయించే వారు కొత్త కొత్త పద్దతులు అవలంభిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో గంజాయి వినియోగం భారీగా పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా బంగారు భవిష్యత్తు ఉన్న యువత మత్తుకు బానిసలుగా మారి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. వరంగల్ నగరంలోని అండర్ రైల్వేగేట్.. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉండడంతో.. స్మగ్లర్లు సులభంగా గంజాయి రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం, డోర్నకల్, కొత్తగూడెం, భద్రాచలం నుంచి.. గుట్టుచప్పుడు కాకుండా రైళ్ల ద్వారా నగరానికి చేరవేస్తున్నారు. అటు శివనగర్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున గంజాయిని డంప్ చేస్తూ.. అక్కడి నుంచి ఖిలా వరంగల్, రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్, ఉర్సుగుట్ట ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. పాత నేరస్తులు కొంతమంది గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే పోలీస్ స్టేషన్‌లు ఉన్నా.. నిఘా నిర్లక్ష్యం నీడలో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్న వయస్సులోనే మత్తు పదార్థాల రుచి మరిగి.. విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భవిష్యత్తు మాట అటుంచితే.. మత్తులోనే దారుణాలకు ఒడి గడుతున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ నగరంలో గంజాయి దందాలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సిగరెట్లలో గంజాయి నింపి యథేచ్ఛగా విక్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. సిగరెట్‌లో పొగాకు తీసేసి.. అందులో గంజాయిని నింపి సేవిస్తున్నారు. దీంతో వ్యాపారులకు.. సిగరెట్లు, గంజాయితో రెండు రకాలుగా ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఖమ్మం రోడ్డు వరకు చాలాచోట్ల ఇలాంటి తతంగం జరుగుతున్నట్టు సమాచారం. ఇలా తేలిగ్గా గంజాయి దొరకడంతో.. పదో తరగతి విద్యార్థులు మొదలు.. పాత నేరస్తుల వరకు మత్తులో తూగుతున్నారు.