ఎస్టీల రిజ‌ర్వేష‌న్ పెంపుకు ఛ‌త్తీస్‌గ‌ఢ్ కోర్టు బ్రేక్‌..

Share On

ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ 10 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్ర హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఐతే ఇప్పటికే ఆ జీవో కారణంగా పొందిన ప్రవేశాలు, ఉద్యోగాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని వెల్లడించింది.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2012లో రిజర్వేషన్లపై చట్ట సవరణ చేసింది. ఎస్సీ రిజర్వేషన్లను తగ్గించి.. ఎస్టీ రిజర్వేషన్‌లను పెంచింది. బీసీ రిజర్వేషన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ నిర్ణయంతో ఎస్సీల రిజర్వేషన్లు 16 శాతం నుంచి 12 శాతానికి తగ్గాయి. ఐతే ఎస్టీల కోటాను ఏకంగా 12 శాతం మేర పెరిగి.. 18 శాతం నుంచి 30శాతానికి చేరింది. ఓబీసీల రిజర్వేషన్లు 14 శాతం మేర ఉంది. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. తద్వారా విద్యా, ఉద్యోగ నియామకాల్లో మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న పరిమితి ఉంది. ఐనప్పటికీ అప్పటి బీజేపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా 58శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. గురు ఘాసీదాస్ సాహిత్య సమితితో పాటు మరికొందరు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై దాదాపు 10 ఏళ్లుగా విచారణ జరిగింది. జులైలో విచారణ పూర్తిగాకా.. సోమవారం తీర్పును వెలువరించింది హైకోర్టు. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడం.. సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం చేయకుండానే.. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అసలు రిజర్వేషన్ల పరిమితిని పెంచూతూ.. తీసుకున్న అసాధారణ నిర్ణయానికి.. దారితీసిన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం సహేతుకంగా వివరించలేకపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ కుమార్ పాండే తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టు దానిని కొట్టివేసిందిన చెప్పారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu