
మహిళల ఆందోళనలతో ఇరాన్ వణికిపోతుంది. ఇరాన్ పోలీసు కస్టడీలో ఇటీవల ఒక మహిళ మృతిచెందడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన చేస్తున్న మహిళలను వీరిని అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపాయి. ఈ క్రమంలో 31 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ కేంద్రంగా ఉన్న ఓస్లో అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాజాగా అక్కడ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల వినియోగంపై నిషేధం విధించారు. ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్, యూట్యూబ్‌తోపాటు టిక్‌టాక్‌పై గతేడాది నుంచే నిషేధం విధించగా.. తాజాగా ఈ రెండు మాధ్యమాలపై ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్నఆమె గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ సెప్టెంబర్ మూడో వారంలో ప్రాణాలు కోల్పోయారు. కస్టడీలో పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే అమిని మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
పోలీసు కస్టడీలో మహ్సా అమిని మృతిచెందడంపై దేశవ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన మొదలయ్యింది. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి అణచివేతకు గురవుతున్నామంటూ ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలువురు మహిళలు తమ జట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇవి మరింత ఉద్ధృతమవడంతోపాలు హింసాత్మకంగా మారుతున్నాయి.