
ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను రఫెల్ నాదల్‌తో జోడీగా ఆడాడు. శుక్రవారం జరిగిన లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో టీమ్ యూరోప్ తరఫున ఫెదరర్, నాదల్.. అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్ తియాఫో, జాక్ సాక్‌తో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో ఫెదరర్, నాదల్ జోడీ.. ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది. దీంతో మ్యాచ్ అనంతరం అతడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. తన ప్రియ సహచరుడైన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫెదరర్‌ను చూసి తట్టుకోలేక నాదల్ కూడా కంటతడిపెట్టాడు. దీంతో కోర్టు ప్రాంగణమంతా ఒక్కసారి ఉద్విగ్నంగా మారింది.
ఆ తర్వాత ఫెదరర్ తోటి ఆటగాళ్లు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన తన భార్య మిర్కాను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లేవర్ కప్ ట్విటర్ ఖాతాలో పంచుకుని స్విస్ దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఫెదరర్, నాదల్ ఫొటోలను ఆస్ట్రేలియా ఓపెన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ”భీకర ప్రత్యర్థులు.. ఉత్తమ సహచరులు” అని రాసుకొచ్చింది. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేస్తూ.. ”ప్రధాన ప్రత్యర్థులు ఇలా భావోద్వేగానికి గురికావడం స్పోర్ట్స్ గొప్పతనం. నాకు అత్యంత అందమైన స్పోర్టింగ్ పిక్చర్ ఇదే” అని క్యాప్షన్ ఇచ్చాడు.