
ఒక మహిళ సోషల్ మీడియాకు బానిసగా మారిపోయి, రోజు వీడియోలు చేస్తోంది.. అది భర్తకు నచ్చడం లేదు. ఎప్పటికి సోషల్ మీడియాలో ఉండడం అంత మంచిది కాదని, సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలని భార్యకు పలుమార్లు చెప్పాడు. ఐనా ఆవిడ మాట వినడం లేదు. చివరికి భర్త మాట వినడం లేదని భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్ భోజ్‌పుర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్, అనిల్‌కు 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సోషల్ మీడియాలో అన్నూ వీడియోలు(రీల్స్) చేస్తుండేది. భార్య అలా చేయడం భర్తకు నచ్చలేదు. వీడియోలు చేయొద్దని ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఉద్రేకానికి గురైన అనిల్ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. సమాచారం అందుకున్న నవాడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.