
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ ఇరాన్ మహిళలు పిడికిలి బిగిస్తూ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.
చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరినీ అనుమతించం. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం అంటూ ఒక అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందన్న ఆయన.. ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. ఇక మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందన్న రైసీ.. ఫోరెన్సిక్‌తోపాటు న్యాయ నిపుణుల నివేదికలు త్వరలోనే వస్తాయన్నారు.
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోవడం ఇరాన్‌లో ఆందోళనలకు కారణమైంది. దీంతో మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గడిచిన 12 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 76 మంది మృత్యువాతపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది..