ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వయంత్రాంగం, ప్రజలకు అనునిత్యం సేవచేసే అధికార యంత్రాంగం పనితీరులో ఏలాంటి దాపరికం ఉండొద్దు. ప్రతి పథకం, ప్రతి పని ఓటేసిన ప్రజలకు తెలియాల్సిందే. అవినీతి రహిత సమాజం కోసం, రహస్యాలు లేని పాలనకోసం, పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కుచట్టాన్ని ఎంతోమంది మేధావులు పోరాట ఫలితంగా ఏర్పాటైయింది. కాని అధికారుల, పాలకుల అవినీతి బయటపడుతోందని దానిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరికి అన్ని విధాలా సమాచారం అందుబాటులో ఉండాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులను పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు, శాఖలు, ఆఫీసులు, యంత్రాంగం, పాలన, నిర్ణయాలు, జీవోలు, ప్రజాధనం ఖర్చు, విదేశీ పర్యటనల ఖర్చు (కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ వంటి రాజకీయపార్టీలతో సహా) వంటివన్నీ, అంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నింటికి సంబంధించిన అంశాలన్నీ ఆర్టీఐ చట్టపరిధిలోకొస్తాయి. అడగడం సామాన్యుడి హక్కు, సమాచారాన్నిఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత..
సమాచారహక్కు చట్టం దరఖాస్తు విధానం.
- సెక్షన్ 6 (1) ప్రకారం సమాచారం కోరదలచేవారు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా స్థానిక భాషలో రాత ద్వారా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత సంబంధిత అధికార యంత్రాంగానికి చెందిన కేంద్ర పౌర సమాచార అధికారికి (ప్రతి కార్యాలయంలో ఉంటారు) లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారికి అందించాలి. అలాగే సెక్షన్6 (2) ప్రకారం సమాచారం కోరుతున్న వారు అందుకు గల కారణం చెప్పవల్సిన అవసరం లేదు. తనకు కబురు చేసేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు తెల్పవల్సిన అవసరం లేదు.
- సెక్షన్ 7 (1) ప్రకారందరఖాస్తు అందుకున్న నాటి నుంచి 30 రోజులలోపు ఆ సమాచారం అందించాలి లేదా సెక్షన్8, 9 కార ణాల వల్ల అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టు తెల్పాలి. ఓ వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించిందైతే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు ఆ సమాచారం అందించాలి.
- సెక్షన్ 7 (2) ప్రకారం కాలపరిమితిలోపు కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయం ప్రకటించకపోతే ఆ అభ్యర్థనను కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి తిరస్కరించినట్టు భావించాలి.
- సెక్షన్ 7 (8) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి ఒక అభ్యర్ధనను తిరస్కరిస్తే కారణాలు దరఖాస్తుదారుకి తెల్పాలి. తిరస్కరణపై అప్పీలు చేసుకునేందుకు ఉన్న కాలపరిమితి, అప్పీలు విచారించే అధికారి వివరాలు కూడా తెల్పాలి.
రుసుం వివరాలు..
- సెక్షన్ 7 (3) ప్రకారం సమాచారాన్ని అందించడానికి మరికొంత రుసుము అవసరమైతే ఆ రుసుము చెల్లించాల్సిందిగా దరఖాస్తు దారునికి తెల్పాలి. రుసుము డిపాజిట్ అయ్యే రోజు వరకుపట్టిన కాల వ్యవధిని 30 రోజుల నుంచి మినహాయించాలి.
- సెక్షన్ 7 (5) ప్రకారం సమాచారం అచ్చురూపంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో అందించవల్సినపుడు దరఖాస్తుదారు అందకుకు అవసరమైన రుసుము చెల్లించాలి. అయితే దారిద్య్రరేఖ దిగువున ఉన్నవారి నుంచి ప్రభుత్వం ఎలాంటి రుసుము వసులు చేయరాదు.
- సెక్షన్ 7 (6) ప్రకారం 30 రోజుల కాలపరిమితి పాటించడంలో అధికార యంత్రాంగం విఫలమైతే దరఖాస్తుదారుకి ఆ సమాచారం ఉచితంగా అందించాలి.
సమాచారహక్కు చట్టం ద్వారా సమాచారం పొందడం ఏలా..
సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినా సమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ)
దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి. వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తుఫారాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు
దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి
మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి
సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) / పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు ,
కార్యాలయం చిరునామా
విషయం: దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం
పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు
దరఖాస్తుదారు పేరు
తండ్రి / భర్త పేరు
కేటగిరి: ఎస్సి / ఎస్టి / ఓబిసి
దరఖాస్తు రుసుము
మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును / కాదు
మీ పోస్టల్ చిరునామా, మొబైల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడి (అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు)
తేదీ, ఊరు
దరఖాస్తుదారు సంతకం
జతపరుస్తున్న పత్రాల జాబితా
దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి / పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండిసమాచార హక్కు (ఆర్టి ఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది.
సుంకం మినహాయింపు కోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది.
దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు. పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. కొరియర్ ద్వారా పంపవద్దు.
దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతి అవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి
మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయంనుంచి రసీదు తీసుకోండి. ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి. దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపి ఆ రసీదును భద్రంగా వుంచుకోండి
ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి , సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది
మీరు ఈ కింది అంశాలనుకూడా గుర్తుంచుకోవాలి
క్రమ సంఖ్య
పరిస్థితి సమాచారం అందజేయడానికి గడువు
1 సాధారణ పరిస్థితిలో 30 రోజులు
2 వ్యక్తి జీవితానికి, స్వేచ్చకు సంబంధించినదైతే 48 గంటలు
3 సహాయ పౌర సమాచార అధికారిద్వారా దరఖాస్తు అందితే అదనంగా 05 రోజులు కలుపుకోవాలి
మొదటి అప్పీలు అప్లికేషన్‌ను దాఖలుచేయడం ఎలా?
- మొదటి అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి
మీరు కోరిన సమాచారాన్ని అందించకుండా, పౌర సమాచార అధికారి మీ దరఖాస్తును తిరస్కరిస్తే
అధికార యంత్రాంగం నిర్ణీత గడువు, 30 రోజులు లేదా 48 గంటల లోగా, సమాచారాన్ని అందించలేకపోతే
మీ దరఖాస్తును స్వీకరించవలసిన, లేదా మీరు కోరిన సమాచరాన్ని అందించవలసిన సహాయ పౌర సమాచార అధికారిని / పౌర సమాచార అధికారిని ప్రభుత్వ యంత్రాంగం నియమించివుండకపోతే
దరఖాస్తును స్వీకరించడానికి, దానిని పౌర సమాచార అధికారికి పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే
పౌర సమాచార అధికారి ఇచ్చిన తీర్పు మీకు సంతృప్తికరంగా లేకపోతే
మీకు అందించిన సమాచారం అసమగ్రంగావున్నదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే
సమాచారహక్కు చట్టం -2005 ప్రకారం చూస్తే, మిమ్ములను చెల్లించమనికోరిన దరఖాస్తు రుసుము సహేతుకంగా లేదని మీరు భావిస్తే - మొదటి అప్పీల్‌కు గడువు
నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , రాష్ట్ర పౌర సమాచార అధికారి (ఎస్పీఇఓ) / కేంద్ర పౌర సమాచార అధికారి (సిపీఇఓ) కార్యాలయంనుంచి ( మీ విజ్ఞప్తి పై తీర్పుచెబుతూ లేదా మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ) సమాచారం అందిన 30 రోజులలోగా దరఖాస్తుదారు
అనివార్య కారణాలవల్ల 30 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు మొదటి అప్పిలేట్ అధికారి సంతృప్తి చెందితే, 30 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు - మొదటి అప్పీలును ఎలా వ్రాయాలి
తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు లేదా వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు, వ్రాసినదో టైప్ చేసినదో మాత్రమే అయివుండాలి
దరఖాస్తును ఇంగ్లీషు, హిందీ లేదా రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో మాత్రమే వ్రాయాలి
అవసరమైన సమాచారాన్ని, నిర్దేశించిన రీతిలో స్పష్టంగా పేర్కొనాలి
మీదరఖాస్తు ఫారానికి, స్వయంగా ధ్రువీకరించిన మీ విజ్ఞప్తి పత్రం జిరాక్స్ కాపీని, దరఖాస్తు రుసుము రసీదును, మీ విజ్ఞప్తి పత్రం అందినట్టు పౌర సమాచార అధికారినుంచి వచ్చిన అక్నాలెడ్జిమెంటు కార్డును, తీర్పు కాపీని జతపరచాలి
దరఖాస్తు ఫారాన్ని, దానికి జతపరచిన అన్ని పత్రాలను ఒక కాపీ జిరాక్స్ తీయించుకొని మీవద్ద వుంచుకోండి - మొదటి అప్పీలు దరఖాస్తును ఎక్కడ సమర్పించాలి
మీ విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించిన యంత్రాగ కార్యాలయంలోనే మొదటి అప్పిలేట్ అధికారికి మీ దరఖాస్తును సమర్పించాలి
అధికార క్రమంలో, మొదటి అప్పిలేట్ అధికారి పౌర సమాచార అధికారికంటే పై అధికారి అయి వుంటూ; దరఖాస్తును స్వీకరించే, కోరిన సమాచారాన్ని అందించే లేదా దరఖాస్తును తిరస్కరించే బాధ్యత కలిగివుంటారు.
మొదటి అప్పీలు దరఖాస్తును సమర్పించే ముందు, ఆ దరఖాస్తులో మొదటి అప్పిలేట్ అధికారి పేరును సరిగా పేర్కొన్నదీ లేనిది, నిర్దేశించిన రుసుమును, నిర్దేశించిన రీతిలోనే చెల్లించిందీ లేనిది, సరిచూసుకోండి ( కొన్ని రాష్ట్రాలు మొదటి అప్పీలు దరఖాస్తుకు రుసుము వసూలు చేయడం లేదు, మరికొన్ని రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయి). - మొదటి అప్పీలు దరఖాస్తును ఎలా పంపాలి
దరఖాస్తును స్వయంగా అందజేయాలి , లేదా పోస్టుద్వారా పంపాలి
పోస్టు ద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్ పోస్టుద్వారా మాత్రమే పంపాలి. ఎట్టి పరిస్థితులలో కూడా కొరియర్ ద్వారా పంపకూడదు.
స్వయంగా అందించినా, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినా కూడా తప్పనిసరిగా రసీదు తీసుకోవడం మరువవద్దు - కోరిన సమాచారం అందించడానికి గడువు
- సాధారణంగా, 30 రోజులలో నిర్ణయం ప్రకటించాలి, అయితే అసాధారణ సందర్భాలలో 45 రోజులదాకా మినహాయింపు వుంటుంది.
- దరఖాస్తుపై నిర్ణయాన్ని తెలిపే గడువు, మొదటి అప్పిలేట్ అధికారికి దరఖాస్తు అందినరోజు నుంచి మొదలవుతుంది.
రెండవ అప్పీలు అప్లికేషన్‌ను దాఖలుచేయడం ఎలా?
- రెండవ అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి
మొదటి అప్పీలు అధికారి తీర్పుతో మీరు సంతృప్తిచెందనపుడు
యంత్రాంగం అందజేసిన సమాచారం సమగ్రంగా లేదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే
పౌర సమాచార అధికారి (పిఎఓ) గాని, లేక మొదటి అప్పిలేట్ అధికారి (ఎఫ్ఏఏ) గాని, లేదా ఇద్దరూ కూడా, దరఖాస్తులో మీరు కోరిన సమాచారాన్ని అందించడానికి నిరాకరిస్తే,
నిర్ణీత గడువులోగా అప్పిలేట్ అధికారి ఎలాంటి తీర్పు ఇవ్వకపోతే
మీ దరఖాస్తును స్వీకరించడానికి, లేదా దానిని కేంద్ర / రాష్ట్ర సమాచార అధికారికి, లేదా కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషనర్‌కు పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే
మీరు దరఖాస్తు చేయడానికి యంత్రాంగం అడిగిన ఫీజు, సమాచారహక్కు చట్టం-2005 ప్రకారం హేతుబద్ధంగా లేదని మీరు భావిస్తే - రెండవ దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి
రాష్ట్ర సమాచార కమిషనర్ (ఎస్ఐసి) కార్యాలయంలో (విషయం రాష్ట్ర యంత్రాంగానికి సంబంధించినదైతే)
కేంద్ర సమాచార కమిషనర్ (సీఇసి) కార్యాలయంలో (విషయం కేంద్ర యంత్రాంగానికి సంబంధించినదైతే) - రెండవ అప్పీల్‌కు గడువు
నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , మొదటి అప్పీల్ అధికార కార్యాలయంనుంచి (మీ దరఖాస్తుపై తీర్పు చెబుతూ లేక మీదరఖాసును తిరస్కరిస్తూ) సమాచారం అందిన 90 రోజుల లోగా
దరఖాస్తుదారు అనివార్య కారణాలవల్ల 90 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు రాష్ట్ర / కేంద్ర సమాచార కమిషనర్ సంతృప్తి చెందితే, 90 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు. - రెండవ అప్పీలును ఎలా వ్రాయాలి
తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు లేదా వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తును వ్రాయవచ్చు లేదా టైప్ చేయవచ్చు
కేంద్ర సమాచార కమిషనర్‌కు సమర్పించే దరఖాస్తు ఫారాన్ని హిందీ లేదా ఇంగ్లీషులోనే వ్రాయాలి, రాష్ట్ర సమాచార కమిషనర్‌కు సమర్పించే దరఖాస్తు ఫారం రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో వుండవచ్చు - దరఖాస్తులో ఏమేమి వ్రాయాలి
అవసవసరమైన సమాచారాన్ని నిర్దేశించిన పద్ధతిలో, స్పష్టంగా వ్రాయాలి
దరఖాస్తుకు ఏఏ పత్రాలు జతచేస్తున్నది , పేజి నంబర్లతో సహా, పేర్కొంటూ విషయ సూచిక పేజీ వుండాలి
అన్ని పత్రాలను ఐదు కాపీలు తయారుచేయాలి (అవి: రెండవ అప్పీలు దరఖాస్తు , సమాచారాన్ని అందించాలన్న వినతిపత్రం, మొదటి అప్పీలు దరఖాస్తు కాపీ, పీఇఓ కు చెల్లించిన ఫీజు రశీదు మొదలైనవి) , వాటిని స్వయంగా ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి లేదా వేలిముద్ర వేయాలి. మీ దగ్గర వుంచుకోవడంకోసం అదనంగా ఒక కాపీ తీయించుకోవాలి. - దరఖాస్తును ఎలా పంపాలి
దరఖాస్తు 5 కాపీలు రిజిస్టర్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి
దరఖాస్తు ఫారానికి, అది అందినట్టు తెల్పడంకోసం, అక్నాలెడ్జిమెంటు కార్డునుకూడా జతచేయాలి
కేంద్ర సమాచార కమిషనర్‌కు సమర్పించే దరఖాస్తును ఆన్ లైన్లో, అంటే కంప్యూటర్ ద్వారా కూడా క్లిక్ చేసి, సమర్పించవచ్చు - సమాచారం అందింఛడానికి గడువు
సాధారణ పరిస్థితులలో 30 రోజులలోగా నిర్ణయాన్ని ప్రకటించాలి ; అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 45 రోజుల వరకు అనే మినహాయింపు వుంది
కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి దరఖాస్తు అందిన తేదీనుంచి గడువును లెక్కిస్తారు. - కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ తీర్పుకు ఉభయ పక్షాలు కట్టుబడివుండాలి. అయితే, ఆ నిర్ణయంపై యంత్రాంగం అసంతృప్తిచెందితే, కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.