
కొడుకు చదువుకోకుండా ఎంత వద్దని చెప్పినా టీవీ చూస్తున్నాడు.. అందుకు ఆ తల్లి తన పిల్లవాడికి క్రమశిక్షణ అలవర్చేందుకు కఠినంగా వ్యవహరించింది. అదే పనిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఒక జంట మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో నివసిస్తోన్న దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల తల్లిదండ్రులు ఒక పనిమీద బయటకు వెళ్తూ.. హోంవర్క్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. వారు ఆలస్యంగా తిరిగిరాగా.. అతను హోంవర్క్ పక్కనపెట్టేసి, అప్పటికీ టీవీ చూస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను నిద్రకు ఉపక్రమించాడు. దీంతో ఆగ్రహించిన తల్లి.. అతన్ని దారిలో పెట్టాలని చూసింది.
కుమారుడిని నిద్రలేపి తీసుకొచ్చి బలవంతంగా టీవీ ముందు కూర్చొబెట్టింది. అతను నిద్రలోకి జారుకోకుండా ఇద్దరు ఒక కంట కనిపెట్టారు. మొదట్లో ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు.. క్రమంగా అలసటతో కూర్చోలేకపోయాడు. మెలకువగా ఉండటం కష్టంగా మారింది. చివరకు ఏడుపు మొదలుపెట్టాడు. నిద్రపోతానంటూ వేడుకున్నాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతన్ని ఉదయం 5 వరకు టీవీ చూపెడుతూ.. నిద్రపోనివ్వలేదని ఒక వార్తాసంస్థ తెలిపింది. తాము చేసిన పని అతనిపై సానుకూల ప్రభావం చూపిందని తల్లి చెప్పడం గమనార్హం.