
గత కొన్ని నెలల నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది.. ఈ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. ఉక్రెయిన్ వైపు భారీ సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మైఖైలో పొడొల్యాక్ వెల్లడించారు. 10,000 నుంచి 13,000 మంది వరకు తమ సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. యుద్ధం మొదలై దాదాపు తొమ్మిది నెలలు దాటినా ఇరు పక్షాల నుంచి మృతుల సంఖ్యపై కచ్చితమైన వివరాలు వెలువడలేదు. మైఖైలో జూన్లో ఒక సారి మాట్లాడుతూ యుద్ధంలో ప్రతి రోజు 100 నుంచి 200 మంది ఉక్రెయిన్ సైనికులు మరణిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ మృతుల సంఖ్యను పారదర్శకంగా చెబుతుందని పేర్కొన్నారు. ”మా కమాండర్ ఇన్ ఛీఫ్ అధికారికంగా మూల్యాంకనం చేస్తారు. వారి లెక్క ప్రకారం మృతుల సంఖ్య 10,000-13,000 మధ్యలో ఉంది” అని పేర్కొన్నారు. పౌరుల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. రష్యా వైపు లక్ష మంది మరణించగా.. మరో లక్షన్నర మంది గాయపడి ఉంటారని పేర్కొన్నారు.