
భూమి వివాదం కారణంగా ఝార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన సమీప బంధువు తల నరికి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం నిందితులు ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన ఖుంతీ జిల్లాలోని ముర్హూ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాను ముండా(24) అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తమ కుమారుడు కనిపించలేదని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మేనల్లుడు సాగర్ ముండా, అతడి స్నేహితులే తన కుమారుడిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో ఆరోపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం కాను మొండాన్ని సమీపంలోని కమాంగ్ గోప్లా అడవిలో పోలీసులు కనుగొన్నారు. అతడి తల అక్కడికి 15 కి.మీ దూరంలో లభించింది. నరికిన తలతో నిందితులు సెల్ఫీ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, రక్తం మరకలతో ఉన్న రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.