
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి విజయం సాధించారు. బుధవారం వెలువడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ బాబీ కిన్నార్ గెలిచారు.
సామాజిక కార్యకర్త అయిన 38 ఏళ్ల బాబీ అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. 2017లో జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బాబీకి టికెట్ ఇచ్చింది. డిల్లీలో ఒక టాన్స్‌జెండర్ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాల్లో గెలుపొందింది. ఇక భాజపా 104 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది.