
సాయిబాబా పాదాలకు నమస్కరిస్తూ ఒక భక్తుడు కన్నుమూశాడు. ఈ విషాదకర ఈ సంఘటన మధ్యప్రదేశ్ కట్నీలోని పహరువా మండి రోడ్డులో జరిగింది. ఒక భక్తుడు నమస్కారం చేస్తూ అలాగే కుప్పకూలిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికంగా మెడికల్ దుకాణం నిర్వహిస్తోన్న రాకేశ్ మెహానీ అనే వ్యక్తికి సాయినాథుడంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులో సాయిబాబా గుడికి వెళ్తుండేవాడు. అయితే, డిసెంబరు 1న కూడా సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేశ్.. అక్కడ బాబా పాదాలకు మొక్కుతూ అలాగే ఉండిపోయాడు. అక్కడున్న భక్తులు.. ఆయన నమస్కారం చేస్తున్నాడేమో అని భావించారు.
ఆయన తర్వాత వెళ్లినవాళ్లు నమస్కారం చేసి వచ్చేస్తున్నా రాకేశ్ మాత్రం కదలకుండా పావుగంట పాటు అలాగే ఉండిపోవడంతో అనుమానం వచ్చి చూసేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో ఆలయ పూజారికి విషయం తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రాకేశ్ సైలెంట్ గుండెపోటుకు గురైనట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. రాకేశ్ కుప్పకూలిపోయిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (SMI)గా పిలిచే సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురైతే విపరీతమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, ఆకస్మికంగా ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాల ఉంటాయి. బయటకు ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. క్షణాల్లో గుండెపోటుతో ప్రాణాలు పోతాయని తెలిపారు.