ఇరాన్ లో హిజాబ్ ఆందోళనలు.. విద్యార్థులపై విషప్రయోగం..

Share On

హిజాబ్ ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు అక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖరాజమీ, ఆర్క్‌ విశ్వవిద్యాలయాలు సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన దాదాపు 1,200 మంది విద్యార్థులు నిన్న ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, వీరేచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే, వీరిపై విషప్రయోగం జరిగిందని ది నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. తాజా ఘటనతో విశ్వవిద్యాలయ కెఫెటేరియాల్లో తినకూడదని వారు నిర్ణయించుకున్నారు.

మహ్సా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్‌ను సరిగ్గా ధరించకుండా మహిళల డ్రెస్‌కోడ్‌ను ఉల్లంఘించిందని సెప్టెంబర్‌ 16న ఆమెను నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అమిని పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు భగ్గుమన్నాయి. వేల సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు. రాజధాని టెహ్రాన్‌తో సహా దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా సాగాయి. ఆందోళనల్లో మహిళలు పలు మార్గాల్లో తమ నిరసనలు తెలిపారు. జుట్టు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను దహనం చేశారు. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులు, సైన్యాన్ని ప్రయోగించింది. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణలు, కాల్పుల్లో 450 మందికి పౌరులు, 60 మంది వరకు భద్రతా బలగాలు మరణించారని హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం నైతిక పోలీస్‌ విభాగం (మోరాలిటీ పోలీస్‌)ను రద్దు చేసింది. అయినా అక్కడ ఆందోళనలు ఆగడం లేదు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu