
అటవీ భూమి ఎక్కడ ఖాళీగా కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారు.. కొంతమంది అధికారులకు అమ్యామ్యాలు ఇస్తూ పట్టాలు కూడా చేపించుకుంటున్నారు.. అక్రమార్కులు పచ్చని అడవిని సర్వనాశనం చేస్తూ ఎడారిలా మార్చుతున్నారు. స్థానిక నాయకులకు వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు కూడా వత్తాసు పలికేసరికి కబ్జాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖకు సంబంధించి మొత్తం ఏఏ జిల్లాలలో ఎన్ని రకాల అటవీ భూములు ఉన్నాయి.. అందులో ఎన్ని ఏకరాల భూములు అక్రమణకు గురయ్యాయి.. అక్రమించిన వారిలో ఎంతమందిపై ఎన్ని కేసులు నమోదు చేశారో పూర్తి వివరాలు ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి రాష్ట్ర అటవీశాఖకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామని చెపుతూ వారి ఇచ్చిన సమాచారాన్ని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి బయటపెట్టారు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 27,68,793,57హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయని అటవీశాఖ పిఐఓ రామామూర్తి సమాచారం ఇచ్చారు. 2006-07 నుంచి 2021-22 వరకు మొత్తం అటవీశాఖలో 753387.63 ఎకరాల భూమిని కబ్జాదారులు అక్రమంగా అక్రమించారని తెలిపారు. అటవీభూమి అక్రమణలో 27923 మంది పాల్గొనగా అందులో ఇప్పటివరకు 10306 మందిపై కేసులు నమోదు చేశామని డిప్యూటి కన్జర్వేషన్ అధికారి తెలిపారు. ఇంకా ఎక్కడెక్కడ అక్రమణకు గురయ్యాయో పరిశీలిస్తున్నామని, అందుకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అటవీభూమి అక్రమణలో పాల్గొన్నది 27923మంది అని అటవీశాఖ అధికారులే చెపుతున్నప్పటికి, 10306మందిపై మాత్రం కేసులు నమోదు చేశారు. అందులో సగం మందిపై కూడా కేసులు ఎందుకు నమోదు చేయలేదో మాత్రం అర్థం కావడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆరోపిస్తోంది.