
చైనాను కరోనా వణికిస్తోంది.. లక్షలాది కేసులు, అదే తీరుగా మరణాలు ఉన్నాయని పలురకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. అసలు చైనాలో ఏం జరుగుతుందో బయటి సమాజానికి తెలిసింది తక్కువ.. చైనాలోని కరోనా కేసులు, మరణాలపై డ్రాగన్ ఎట్టకేలకు నోరువిప్పింది.
గతేడాది డిసెంబరు నుంచి తమ దేశంలో డిసెంబరు 8 నుంచి జనవరి 12 వరకు దాదాపు 60వేల కొవిడ్ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం నివేదిక విడుదల చేసింది. కొవిడ్ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435 మంది మరణించినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. మృతుల సగటు వయసు 80 ఏళ్లుగా పేర్కొంది. మరణించిన వారిలో 90 శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది.
ప్రజాగ్రహంతో దిగొచ్చిన చైనా ప్రభుత్వం గతేడాది డిసెంబరులో జీరో కొవిడ్ ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగింది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, జీరో కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత కొవిడ్ కేసుల లెక్కింపును డ్రాగన్ సర్కారు నిలిపివేసింది. కేవలం శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యంతో మరణించిన వారిని మాత్రమే కొవిడ్ మృతులుగా అధికారింగా లెక్కిస్తున్నట్లు గత నెల ప్రకటించింది. అలా తమ దేశంలో ఇప్పటివరకు 5,272 మంది మరణించినట్లు జనవరి 8న ప్రకటించింది.
చైనాలో కొవిడ్ అత్యంత తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు ఇక్కడి పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అత్యధికంగా గాన్సు ప్రావిన్సులో 91శాతం జనాభా వైరస్ బారిన పడ్డారని పేర్కొంది. మరో రెండు, మూడు నెలలు ఇదే ఉద్ధృతి కొనసాగే అవకాశమున్నట్లు తెలిపింది.