
ములుగు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కలకలం రేపాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇంజనీరింగ్ విభాగం కార్యాలయంలో ఇద్దరు ఇంజనీర్లు ఏసీబీ వలకు చిక్కారు. ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం రూ.50 వేలు నగదు తీసుకుంటున్న ఇద్దరు ఇంజనీర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సమ్మక్క సారలమ్మ జాతర జరిగే తాడ్వాయి మండలం మేడారంలో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేస్తుంది. ఈ క్రమంలో 2022 జాతర జరిగిన సమయంలో మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ సంజీవ మరికొందరితో కలిసి పెయింటింగ్ పనులు చేశాడు. ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. పనులు చేసిన కాంట్రాక్టర్ సంజీవ బృందానికి రూ.16 లక్షలు బిల్లు చెల్లింపులు జరపాల్సి ఉంది. గత డిసెంబర్ లో ఎంబీ రికార్డు చేశారు. రూ.16 లక్షల చెక్కును ఇవ్వడానికి ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉపకార్య నిర్వహక ఇంజనీర్ (డీఈఈ) నవీన్ కుమార్, అసిస్టెంట్ కార్యనిర్వహక ఇంజనీరు (ఏఈఈ) మహ్మద్ హబీద్ రూ. 90 వేలు లంచం డిమాండ్ చేశారు. చేసిన పనులకు సంబంధించి బిల్లు కోసం ఇంజనీరింగ్ విభాగం కార్యాలయాల చుట్టూ తిరిగిన కాంట్రాక్టర్ సంజీవ చివరకు లంచం రూ.80 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని తొలి విడత అడ్వాన్స్ గా రూ.50 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. తర్వాత సదరు కాంట్రాక్టర్ సంజీవ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తనకు రావాల్సిన బిల్లు చెల్లింపుల కోసం ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం డీఈ, ఏఈల సతాయింపులను చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారుల స్కెచ్ ప్రకారం కాంట్రాక్టర్ ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయంలో ఉన్న డీఈఈ నవీన్ కుమార్, ఏఈఈ హబీద్ కాంట్రాక్టర్ నుంచి లంచం రూ.50 వేలు తీసుకుంటున్న సమయంలో అప్పటికే ప్లాన్ ప్రకారం మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఈఈ నవీన్ కుమార్, ఏఈఈ హబీద్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. మేడారం పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఐటీడీఏ డీఈఈ, ఏఈఈ ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం కలిగించింది. ఈ సంఘటనపై ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ రాత్రి వివరాలను వెల్లడించారు. డీఈఈ నవీన్, ఏఈఈ హబీద్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లంచం పుచ్చుకుంటున్న డీఈఈ, ఏఈఈ లను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకోవడం అవినీతి తిమింగలాల్లో గుబులు రేపింది.