
కొందరి మనుషులను, కొన్ని సంఘటనలను చూస్తుంటే మరి చిత్రంగా ఉంటుంది.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థమే కాదు.. అలాంటిది పిల్లలు పుట్టడం లేదని ఒక మహిళతో ఎముకలు తినిపించిన దారుణ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బాధిత మహిళకు సంతానం కలగలేదని భర్త సహా కుటుంబ సభ్యులు ఆమెను కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. శ్మశానంలో ఆ మహిళను కూర్చోబెట్టి ఆమె చేత అస్థికలు తినిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పుణెకు చెందిన భర్త, అత్తమామలు సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మహారాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ రూపాలీ చకంకర్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.