
ఇకపై ఏదైనా కంపెనీ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించే సెలబ్రిటీలు లేదా సామాజిక మాధ్యమాల్లో లక్ష కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్న వ్యక్తులు ఇకపై ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్స్మెంట్ నో హౌస్ పేరుతో శుక్రవారం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆడియో/వీడియో ప్రకటనలతోపాటు సామాజిక మాధ్యమాల్లో నిర్వహించే ప్రచారానికి సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఒకవేళ ఏదైనా సంస్థ లేదా సెలబ్రిటీ నిబంధనలను పాటించకున్నా, విరుద్ధంగా వ్యవహరించినా వారిపై వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటారు. 2022 గణాంకాల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో గతేడాది ₹ 1,275 కోట్ల విలువైన ప్రచారాలు జరిగాయి. 2025 నాటికి ఈ విలువ ₹ 2,800 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఈ నిబంధననను తప్పనిసరి చేశారు. భౌతికంగా కానీ, అవతార్ లేదా గ్రాఫిక్స్ ద్వారా సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రచారం చేసినా ఈ నిబంధనను పాటించాలని సూచించింది.
ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ లేదా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సదరు కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడంతోపాటు, సెలబ్రిటీపై ఏడాడి నుంచి మూడు ఏళ్లకు ఇతర ఉత్పత్తులకు ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తారు. దాంతోపాటు కంపెనీకి, ప్రచారకర్తకు ₹ 10 లక్షల నుంచి ₹ 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
”ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సామాజిక మాధ్యమాల ద్వారా పలు కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో చాలా వరకు వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రకటనలో చూపించినట్లు ఆయా ఉత్పత్తులు లేదా సేవలు వినియోగదారులకు ఫలితాలను ఇవ్వటంలేదని గుర్తించాం. దీనివల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇకపై సెలబ్రిటీలు తాము సదరు ఉత్పత్తికి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఆయా కంపెనీల నుంచి నగదు తీసుకున్నారా.. లేదా ఆ కంపెనీలతో తమకు ఎలాంటి సంబంధం ఉందనేది యూజర్లకు తెలియజేయాలి. అందులో భాగంగానే కొత్త మార్గదర్శకాలను తీసుకొస్తున్నామని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.