
చాలా ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేయొద్దని ఎన్ని సార్లు చెప్పిన కొంత మంది వినరు.. పరిసరాల అపరిశుభ్రతతోపాటు స్థానికులకు ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.. నిత్యం ప్రజలు తిరిగే నగరాలకు ఇది రోజూ తలనొప్పి వ్యవహారమే. ఈ నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను కట్టడి చేసేందుకు గ్రేటర్ లండన్ పరిధి వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంబిస్తోంది. ఇక్కడి సోహో ప్రాంతంలోని ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లోని బయటి గోడలపై నీటిని వికర్షించే పారదర్శక పెయింట్‌ను పిచికారీ చేయిస్తున్నారు. ఈ పూత గల ఉపరితలాలపై నీళ్లు పడినప్పుడు.. వెంటనే మళ్లీ వెనక్కు చిమ్ముతాయి. సోహోలోని 10 ముఖ్య ప్రాంతాల్లో పాలనా యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకుంది.