
ఒక పక్క దేశవ్యాప్తంగా చలి వణికిస్తుంది. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తున్నది. ఎముకలు కొరికే చలితో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. ఎక్కడ 22, 23 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంలేదు. కానీ దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొట్టాయం సిటీలో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా ఉన్నది. అక్కడ భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇవాళ కొట్టాయంలో గరిష్టంగా 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వారం రోజులపాటు కూడా అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున నమోదు కానున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.