
భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది.. మద్యానికి బానిసయ్యాడు.. వచ్చే జీతం అంత తాగుడుకు పెడుతున్నాడు.. ఇంకా చేసేదేమి లేక భార్య కాంట్రాక్ట్ హంతకుల సహాయంతో భర్తను హత్య చేసింది. ప్రమాదవశాత్తూ మరణించినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు గుట్టు రట్టయ్యింది. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ సంఘటన జరిగింది. బీనా హంసదా అనే మహిళ భర్త అనూప్ తుడ్డు, జమాల్‌పూర్ రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెలలో అతడు రిటైర్ కానున్నాడు. మద్యానికి బానిస అయిన అతడు కుటుంబ ఖర్చుల కోసం ఇతరుల నుంచి చాలా అప్పులు చేశాడు.
భర్త అడ్డు తొలగిపోతే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతోపాటు వచ్చే డబ్బుతో అప్పులు కూడా తీరిపోతాయని భార్య బీనా భావించింది. దీంతో భర్త హత్య కోసం ఇద్దరు కాంట్రాక్ట్ హంతకులను సంప్రదించి లక్షకు ఒప్పందం చేసుకుంది. అడ్వాన్స్‌గా రూ.25,000 ఇచ్చింది. జనవరి 1న తన బంధువులంటూ వారిద్దరినీ ఇంటికి రప్పించింది. వారితో కలిసి మద్యం సేవించిన అనూప్ మత్తుగా నిద్రపోయాడు. భార్య బీనా, కాంట్రాక్ట్ కిల్లర్స్ శశికాంత్ అలియాస్ సంజయ్ కుమార్, రంజిత్ అలియాస్ సంజయ్ యాదవ్ కలిసి గొంతునులిమి అనూప్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు.
మరోవైపు కాలువలో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడ్ని అనూప్‌గా గుర్తించారు. అతడి భార్యను ప్రశ్నించగా మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయి ఉంటాడంటూ పోలీసులకు చెప్పింది. అయితే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతునులిమి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 21 రోజుల తర్వాత సాంకేతిక ఆధారాలతో అనూప్ హత్య కేసును ఛేదించారు. తొలుత ఒక కాంట్రక్ట్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో కిల్లర్‌ను కూడా పట్టుకున్నారు. చివరకు హతుడి భార్య బీనా కూడా నిజం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.