
బెంగళూరు నగరంలోని రద్దీగా ఉండే ఆర్కే మార్కెట్ కూడలిలో ఒక యువకుడు కొంతమంది అనుచరులతో వచ్చాడు. సంచీ లోంచి డబ్బులు తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్ కింద జనం గుమిగూడారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వారు తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
ఆ యువకుడు సూట్ ధరించి ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. అంతేకాకుండా మెడలో గోడగడియారం వేలాడదీసుకున్నాడు. అలాగని ఖరీదైన నోట్లను కూడా గాల్లోకి విసర్లేదు. కేవలం 10 రూపాయల నోట్లనే విసిరినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.3000 ఉండొచ్చని అంటున్నారు. కొందరు ఫ్లై ఓవర్ కింద నోట్లను ఏరుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఫ్లైఓవర్‌పై అతడిని డబ్బులు అడిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు.