
అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తెలుగు అమ్మాయి మృతి చెందింది.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. అక్కడ సోమవారం రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో సౌత్ లేక్ యూనియన్‌లోని సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాహ్నవిని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి మృతి చెందింది.
ప్రమాదానికి కారణమైన అధికారి ఎవరనే వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ఈ ఘటనపై విచారణ మాత్రం జరుపుతున్నామని వెల్లడించారు. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. సమాచారం అందుకున్న వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని జాహ్నవి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సమీపంలోని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అంతలోనే ఆమె మరణించినట్లు చెప్పారు. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అభ్యర్థన మేరకు డ్రైవింగ్ చేస్తున్న పోలీసు అధికారి ఒక ఎమర్జన్సీ కాల్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక సదరు అధికారి నవంబర్ 2019 నుండి డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారని, ఢీకొనడానికి దారితీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం ఉన్న ఎవరైనా 206-684-8923కి కాల్ చేయవలసిందిగా కోరారు. అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళుతున్న అనేక మంది తెలుగు వారు, భారతీయులూ తరచూ ఇలాంటి ఘటనల్లో చనిపోతూనే ఉన్నారు. జాహ్నవి మరణవార్త తెలుసుకున్న కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ఊరు, కన్నవారిని వదిలి ఎక్కడో దేశం కాని దేశంలో బిడ్డ మరణించడంతో ఆమె తల్లదండ్రులు కన్నీరుమున్నీరువుతున్నారు.