
ఒంటరిగా ఉంటున్న షణ్ముగం అనే 70 ఏళ్ల వృద్ధుడిని మల్లిక అనే మహిళ నమ్మించి రెండో వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఎత్తుకొని పరారైంది. బెంగళూరు కాటన్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఓటీసీ రోడ్డుకు చెందిన బాధితుడు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. అతన్ని తమిళనాడుకు చెందిన మల్లిక అలియాస్ మల్లర్ (35) పరిచయం చేసుకుంది. తనను రెండో వివాహం చేసుకోవాలని కోరింది.
అందుకు ఆయన అంగీకరించడంతో తమిళనాడు నుంచి తనకు పరిచయం ఉన్న ఇద్దరిని పిలిపించింది. షణ్ముగం ఇంట్లోనే జనవరి 4న వివాహం చేసుకున్నారు. ఆమెకు తోడుగా వచ్చిన వ్యక్తులు కమీషన్‌గా రూ.35 వేలు తీసుకుని వెళ్లిపోయారు. జనవరి పది వరకు షణ్ముగంతోనే కలిసి ఉన్న మల్లిక ఆ తర్వాత ఇంట్లోని 64 గ్రాముల ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు తీసుకుని పరారైంది. తన భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియక, పలు ప్రాంతాలలో ఆయన గాలించారు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించి కాటన్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు.