
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రజలకు సేవకులనే విషయాన్నే ఊమరిచిపోతున్నారు. ప్రభుత్వ శాఖకు సంబంధించిన తగిన సమాచారం తమ దగ్గర లేదని ఖరాఖండిగా చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలలో ఎన్ని గోశాలలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి నిర్వహణ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఖర్చుల వివరాలను, గోశాల వివరాలను తెలపాలని యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ సమాచారహక్కు చట్టం ద్వారా రాష్ట్ర పశువైద్య, పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసింది. కాని ఆ శాఖ అధికారులు మాత్రం సగం సమాధానమే ఇచ్చి, మిగతా సగం తమ దగ్గర లేదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రజా సమాచార అధికారి సమాచారం ఇచ్చారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 221 గోశాలలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ గోశాలలో ఉన్న పశువుల సంఖ్య మొత్తం 30973 అని సమాధానం ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని ఈ గోశాల నిర్వహణకు ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం తమ దగ్గర లేదు అని సమాధానం ఇచ్చారు. కనీసం జిల్లాలలోని గోశాలలకు సంబంధించిన సమాచారం ఇవ్వమని అడిగినా ఆ సమాచారం కూడా తమ శాఖ వద్ద అందుబాటులో లేదని ప్రజా సమాచార అధికారి రామచందర్ వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న గోశాలల సంఖ్య ఉంటుంది. ఆ గోశాలలో ఎన్ని పశువులు ఉన్నాయో ఉంటుంది కాని వాటి ఖర్చుల వివరాలు లేకపోవడం మాత్రం మరీ విచిత్రంగా ఉంది. నిధులను ఖర్చు చేయడంలో ఏదైనా గోల్ మాల్ జరిగే అవకాశం ఉంటుందని అందుకే ఖర్చుల సమాచారం ఇవ్వడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం కొరకు అప్పీలు చేస్తామని వారు తెలిపారు..