
మండే ఎండలకు పగులుతున్న బండరాళ్లు సైతం పగులుతుండడం వల్ల కర్నూలు జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు, మూడు రోజులుగా గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. జిల్లాలోని గోనెగండ్లలోని ఎస్సీకాలనీలో ఎండల దెబ్బకు 500 ఏళ్లనాటి నర్సప్ప కొండరాయికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులు రాయి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొండరాయి ఆరువేల టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉందని అధికారులు అంచనా వేశారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే తొలగింపు పనులు మొదలు పెట్టనున్నారు. ముందు జాగ్రత్తగా ఎస్సీ కాలనీని అధికారులు డేంజర్ జోన్‌గా ప్రకటించారు.
రెండు రోజుల నుంచి నర్సప్ప కొండరాయి ఎండల ధాటికి బాంబు పేలిన విధంగా శబ్ధం చేస్తూ పగిలింది. ఈ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన కాలనీ వాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ తరువాత కొండపగిలినట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం కొండకు వచ్చిన క్రాక్స్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని అధికారులు గుర్తించారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా కొండ పగుళ్లు ఏ మేరకు పెరుగుతుందనే దానిపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు.
కొండను టెక్నికల్‌గా తొలగిస్తేనే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు. కొండ పక్కనే ఉన్న ఇళ్ల వైపు వాలినట్లు ఉన్న నేపథ్యంలో కొంచెం కదిలించినా ఇళ్లపై పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. . కొండ రాళ్లు పగిలిన ప్రదేశం చుట్టూ ఉన్న 50 ఇళ్లను ఖాళీ చేయించి వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ కాలనీ వాసులకు పునరావాసం కల్పించారు. కొండరాళ్ల మధ్య పగుళ్లను సిమెంట్‌తో పూడ్చాలని, ఏటవాలుగా వాలిన కొండరాయికి కింది భాగంలో 12 అడుగుల వరకు ఐరన్ పోల్స్ సపోర్ట్‌గా ఉంచి, ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ బెడ్‌తో పూడ్చాలని ప్రాథమికంగా అధికారులు నిర్ణయించారు.