
మామిడిపండు ధర ఎంత ఉంటుంది.. ప్రాంతం, పండు వెరైటీని బట్టి వాటి ధర కేజీకి రూ.50 నుంచి రూ.500వరకు పలుకుతాయి. కానీ ఒక పండు ధర వందలు కాదు.. వేలల్లో పలుకుతోంది. రూ.19వేలతో రికార్డు సృష్టిస్తుంది. జపాన్‌కు చెందిన హిరోయుకి నకగవా అనే రైతు ఈ మామిడి పండ్లను ప్రత్యేక శీతోష్ణస్థితిలో పండిస్తున్నాడు. హకుగిన్ నో తాయో అనే బ్రాండ్ పేరుతో వీటిని పండిస్తుండగా… ఆ బ్రాండ్ కు అర్థం‘మంచులో సూర్యుడు’అని అర్థం. అత్యంత ప్రత్యేకమైన ఈ మామిడి పండు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే పండుగా ఇది రికార్డుకెక్కింది. హొక్కడో ద్వీపంలోని ఓతోఫుకేలో గ్రీన్ హౌసులో వీటిని సేంద్రీయ విధానంలో, ఎలాంటి రసాయనాలూ వాడకుండా సాగుచేస్తున్నాడు. 2011 నుంచి ఫలసాయం మొదలైంది. ఒక్కో హుకాగిన్ పండు ధర 230 డాలర్లు కాగా.. ఇంత ఖరీదైన పళ్లను పండిస్తానని తాను కలలో కూడా అనుకోలేదని నకగవా చెబుతున్నాడు.
ఈ పంట గురించి చెప్పినపుడు మొదట్లో అందరూ నవ్వారని, కానీ సేంద్రీయ విధానంలో పండిన పండు రుచి బావుంటుందని, దానికి మరింత రుచి జత చేయడానికి ఇలా ప్రయత్నించానని నకగవా అంటున్నాడు. శీతకాలంలో కురిసే మంచును భద్రపరిచి వేసవిలో గ్రీన్‌హౌసుకు చల్లదనం కోసం వాడతాడు. చలికాలంలో పంటకు వేడినీళ్ల ద్వారా సహజ ఉష్ణాన్ని అందించి సమశీతోష్ణ వాతావరంణంలో పంట కాలాన్ని పెంచి రుచికరమైన పళ్లు పండిస్తున్నాడు. సీజన్‌లో కేవలం 5 వేల పండ్లు మాత్రమే దిగుబడి అవుతాయి. హకుగిన్ తో తాయో అనే బ్రాండెడ్ పండ్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని, మిగతా పళ్లకంటే 15 శాతం ఎక్కువ తియ్యగా ఉంటాయని నకగవా చెబుతున్నారు. ఈ పండు కండ వెన్నలా మెత్తగా ఉంటుందన్న ఆయన… పండిన పళ్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుబోతుంటాయని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అతను 2014లో పండించిన ఓ మామిడి పండు రూ. 33 వేలకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డు సృష్టించింది.