
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణం వద్ద భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఇమ్రాన్ అరెస్టును పీటీఐ పార్టీ లాయర్లు అడ్డుకున్నారు. ఘర్షణలో లాయర్లకు గాయాలయ్యాయి. అయితే, ఇమ్రాన్‌ను ప్రభుత్వం వేధిస్తోందని లాయర్లు ఆరోపించారు. అరెస్టు సమయంలో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు వెలుపల భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. అరెస్టు అనంతరం ఇమ్రాన్‌ను పాక్ సైన్యం రహస్య ప్రాంతానికి తరలించింది.
మార్చి 7న ఇమ్రాన్ అరెస్టుకు ఇస్లామాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్‌పై 85పైగా కేసులున్నాయి. ఇక ఇమ్రాన్ పాక్ ప్రధానిగా 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు ప్రధానిగా కొనసాగారు. అయితే, తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ గతంలో ఆరోపించారు. ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పాక్ అంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీటీఐ పార్టీ పులుపునిచ్చిందంటూ ఆ పార్టీ నేత అజర్ మశ్వాని ట్వీట్ చేశారు. ఈ ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ఇమ్రాన్ న్యాయవాది తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొంటూ చొక్కాపై రక్తపు మరకలతో ఉన్న వ్యక్తి వీడియోను పీటీఐ ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యానికి, పాక్‌కు ఇదో చీకటి రోజని అంటూ ట్వీట్ చేసింది.